బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో (సంవాద్) జరిగిన ఆయుష్ వైద్యుల నియమక
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో (సంవాద్) జరిగిన ఆయుష్ వైద్యుల నియమక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక ముస్లిం మహిళా వైద్యురాలి హిజాబ్‌ను బలవంతంగా లాగి తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేగింది.
ఈ కార్యక్రమంలో 1,283 మంది ఆయుష్ వైద్యులకు (685 ఆయుర్వేద, 393 హోమియోపతి, 205 యునానీ) నియమక పత్రాలు అందజేశారు. వీరిలో 10 మందికి నితీష్ కుమార్ స్వయంగా పత్రాలు అందించారు. నుస్రత్ పర్వీన్ అనే యువ వైద్యురాలు హిజాబ్ (ముఖాన్ని కప్పే ముసుగు) ధరించి వచ్చినప్పుడు, నితీష్ “ఏంటిది?” అంటూ ముఖం చిట్లించి, ఆమె స్పందించేలోపు హిజాబ్‌ను కిందకు లాగారు. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి నితీష్‌ను ఆపే ప్రయత్నం చేశారు.
కాగా, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు:కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను “సిగ్గులేని, నీచమైన పని” అంటూ ఖండించింది. “అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకోవడానికి వచ్చిన మహిళా వైద్యురాలి హిజాబ్‌ను లాగడం బీహార్‌లో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారో చూపిస్తోంది. నితీష్ తక్షణం రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేసింది.
ఆర్‌జేడీ “నితీష్‌కు ఏమైంది? మానసిక స్థితి దయనీయంగా తయారైందా లేక 100% సంఘీ అయ్యారా?” అంటూ ప్రశ్నించింది. ఈ చర్య జేడీయూ-బీజేపీ కూటమి మహిళలు, మైనారిటీల పట్ల ధోరణిని చూపిస్తోందని విమర్శించింది. ఇతర విపక్షాలు కూడా నితీష్ మానసిక స్థితిపై ప్రశ్నలు లేవనెత్తాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు (మహిళకు దండ వేయడం వంటివి) జరిగిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది.
జేడీయూ డిఫెన్స్:
నితీష్ సన్నిహితులు, మైనారిటీ వెల్ఫేర్ మంత్రి జమా ఖాన్ ఈ చర్యను సమర్థించారు. “నితీష్ కుమార్ కూతుళ్లను ఎంతో ప్రేమిస్తారు. విజయవంతమైన ముస్లిం కూతురు ముఖాన్ని ప్రపంచం చూడాలని ముసుగు తొలగించారు” అని అన్నారు.ఈ ఘటన మహిళల గౌరవం, మత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులపై మరింత చర్చను రేకెత్తించింది. నితీష్ కుమార్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.

