భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్బీఐ బోర్డు సమావేశాలకు హాజర
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్బీఐ బోర్డు సమావేశాలకు హాజరు కావడానికి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా గురువారం (డిసెంబర్ 18, 2025) జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలను గవర్నర్ ప్రశంసించారు.సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ రంగ సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన, సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచే చర్యల గురించి గవర్నర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా అనియంత్రిత డిపాజిట్ స్కీమ్‌ల నిషేధం (బడ్స్ – BUDS) చట్టాన్ని రాష్ట్రంలో నోటిఫై చేయాలని సంజయ్ మల్హోత్రా సీఎంను కోరారు. అలాగే, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI), ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వద్ద క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ చేపట్టిన ప్రచారం గురించి కూడా ఆయన వివరించారు. రాష్ట్రం మరిన్ని సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగాలని గవర్నర్ ఆకాంక్షించారు.
మరోవైపు, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున వడ్డీ రేట్లు చాలా కాలం పాటు తక్కువగానే కొనసాగే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫైనాన్షియల్ టైమ్స్ (FT)తో ఇంటర్వ్యూలో తెలిపారు. యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదిరితే దేశ ఆర్థిక వృద్ధి ఆర్బీఐ అంచనాలను మించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమెరికాతో ఒప్పందం వల్ల వృద్ధి రేటు సుమారు అర శాతం పెరిగే అవకాశం ఉందని మల్హోత్రా అంచనా వేశారు.

