భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నిమిత్తం చేపట్టిన ఐదు రోజుల హైదరాబాద్ పర్యటన సోమవారం (డిసెంబర్ 22, 2025)తో ముగిసింది. ఈ సాయంత్రం హకీంపే
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నిమిత్తం చేపట్టిన ఐదు రోజుల హైదరాబాద్ పర్యటన సోమవారం (డిసెంబర్ 22, 2025)తో ముగిసింది. ఈ సాయంత్రం హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.హకీంపేట ఎయిర్‌బేస్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు, సివిల్ మరియు రక్షణ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాష్ట్రపతి ప్రయాణం సందర్భంగా బొల్లారం రాష్ట్రపతి నిలయం నుంచి హకీంపేట ఎయిర్‌బేస్ వరకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యలో పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు.
శీతాకాల విడిది కోసం డిసెంబర్ 17న హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ పర్యటనలో ఆమె పలు ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.డిసెంబర్ 19న: రామోజీ ఫిల్మ్ సిటీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్‌ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించారు.
డిసెంబర్ 20న: గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీల శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవ సభలో “టైమ్‌లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్: పాత్‌వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్” అంశంపై ప్రసంగించారు.
డిసెంబర్ 21న: రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులతో ‘ఎట్ హోమ్’ విందును ఏర్పాటు చేశారు.
ప్రతి సంవత్సరం శీతాకాల విడిది కోసం రాష్ట్రపతులు హైదరాబాద్‌కు రావడం ఆనవాయతీ. ఈ సమయంలో రాష్ట్రపతి నిలయం నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 1860లో బ్రిటిష్ రెసిడెంట్ కోసం నిర్మించిన ఈ భవనం, 1948లో హైదరాబాద్ భారత్‌లో విలీనమైన తర్వాత రాష్ట్రపతి దక్షిణ రిట్రీట్‌గా మారింది. మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ 1955లో ఇక్కడ బస చేశారు. అప్పటి నుంచి ప్రతి రాష్ట్రపతి సంవత్సరానికి కనీసం ఒకసారి ఇక్కడికి వచ్చి అధికారిక పనులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

