HomeEditor's ChoiceGeneral

రేవంత్ రెడ్డి ఉగ్రవాది – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి ఉగ్రవాది – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డి తన రెండేళ్ల పాలనలో చెక్‌ డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసిందేమీ లేదని బీఆరెస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల

యూనిఫాం సివిల్ కోడ్ కు మేం వ్యతిరేకం… స్పష్టం చేసిన కేసీఆర్
అనంతగిరి మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..
తాను బీఆరెస్ లోనే ఉన్నానన్న కడియం- దిష్టిబొమ్మలను వేళాడదీస్తానని రాజయ్య హెచ్చరిక‌

రేవంత్‌రెడ్డి తన రెండేళ్ల పాలనలో చెక్‌ డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసిందేమీ లేదని బీఆరెస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తున్న ఉగ్రవాది రేవంత్‌రెడ్డి అని ఆయన‌ వ్యాఖ్యానించారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS)పై కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపడం, కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీల నీళ్లు చాలని లేఖ రాయడం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారని, అది రాజ్యాంగబద్ధమైనదని హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖలో 45 టీఎంసీలు చాలని పేర్కొనడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. “ఇది చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరిగిందా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చెక్ డ్యామ్‌లు పేల్చడం, ప్రాజెక్టులు కూల్చడం తప్ప ఏమీ చేయలేదని, కొత్తగా ఒక్క ఎకరం అయినా నీటి సాగు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 49 లక్షల ఎకరాలకు కొత్తగా లేదా స్టెబిలైజ్డ్ సాగు అందించామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పంటలు పండుతున్నాయని గుర్తు చేశారు.కృష్ణా నది నీటి వినియోగం రేవంత్ పాలనలోనే అతి తక్కువ జరిగిందని, నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా 10 వేల క్యూసెక్కుల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు.

పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామ గ్రామాన ప్రజా ఉద్యమాలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ నిష్క్రియత్వాన్ని ఎండగడతామని హరీష్ రావు హెచ్చరించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి “ఎక్కడికి రమ్మంటావో చెప్పు” అని సవాల్ విసిరారు.ఈ ప్రెస్ మీట్‌తో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఇరిగేషన్ ప్రాజెక్టుల చుట్టూ వివాదం ముదిరింది.