HomeEditor's ChoiceGeneral

“మీరు హైప్‌లో ఉన్నారు… మేం ప్రజల్లో హోప్ సృష్టిస్తున్నాం”

“మీరు హైప్‌లో ఉన్నారు… మేం ప్రజల్లో హోప్ సృష్టిస్తున్నాం”

తెలంగాణలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సమ్మిట్ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో గణనీయంగా పెంచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నా

తెలంగాణ రాజకీయాల్లోకి కల్వకుంట్ల మూడో తరం.. సామాజిక కార్యక్రమాలతో మొదలు..
యుద్దానికి సిద్దం: కేసీఆర్ వస్తున్నాడు
తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ ప్రకటన‌

తెలంగాణలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సమ్మిట్ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో గణనీయంగా పెంచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ సమ్మిట్ వల్ల ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తలు తెలంగాణపై ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, సమ్మిట్ విజయాన్ని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) తక్కువ చేసి మాట్లాడటాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదని ఆయ‌న వ్యాఖ్యలు సూచిస్తున్నాయని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

సమ్మిట్‌లో 5 లక్షల కోట్ల రూపాయలకు మించిన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయని మంత్రి వెల్లడించారు. వీటిని కేసీఆర్ తేలికగా తోసిపుచ్చడం సరికాదని ఆయన అన్నారు. “కేసీఆర్ పాలనలో కూడా అనేక ఒప్పందాలు జరిగాయి కానీ చాలావరకు అమలు కాలేదు. మేం అప్పుడు ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం కుదుర్చిన ప్రతి ఒప్పందాన్ని కింది స్థాయిలో అమలు చేయడానికి కచ్చితమైన ఫాలో-అప్ చర్యలు తీసుకుంటున్నాం” అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా 1.40 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 2 లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.హైదరాబాద్ దేశంలోనే కాకుండా ప్రపంచానికి ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) క్యాపిటల్’గా మారబోతోందని మంత్రి ప్రకటించారు. గత ఏడాది కాలంలోనే 75 అంతర్జాతీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను రాష్ట్రానికి ఆకర్షించామని ఆయన వివరించారు. ఐటీ, ఏరోస్పేస్, వ్యాక్సిన్ ఉత్పత్తి రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, ప్రపంచ అవసరాల్లో మూడింట రెండు వంతుల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఎగుమతవుతున్నాయని గుర్తు చేశారు.

వ్యాపార సంస్కరణల అమలులో (BRAP) కేంద్రం నుంచి అవార్డు అందుకోవడం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు.వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను బీఆర్ఎస్ తమ పేటెంట్‌గా చెప్పుకోవడంపై స్పందించిన మంత్రి, రక్షణ రంగంలో DRDO, DRDL వంటి సంస్థలకు, అలాగే ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీయే అని స్పష్టం చేశారు. ఈ పార్క్ పనులు అసంపూర్తిగా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సందర్శించి నిధులు కేటాయించి పూర్తి చేయించారని, పీఎం మిత్ర పథకం కింద కేంద్రం నుంచి 30 కోట్ల రూపాయలు తెచ్చింది ప్రస్తుత ప్రభుత్వమే అని వివరించారు.

బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడిన శ్రీధర్ బాబు, “మీరు హైప్‌లో ఉన్నారు… మేం ప్రజల్లో హోప్ (నమ్మకం) సృష్టిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఉన్న ‘గేట్ పాస్’ సంస్కృతిని రద్దు చేసి, అందరినీ కలుపుకుని పారిశ్రామిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. పరిశ్రమలతోపాటు స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కేలా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATC) మార్చామని, ఎంఎస్‌ఎంఈల కోసం కొత్త పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతూ కక్షలు లేని పాలన అందిస్తున్నామని చెప్పారు.రాబోయే మూడేళ్లలో మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.