నలగొండ ప్రతినిధి డిసెంబర్ 23( నినాదం )ముఖ్యమంత్రికి నదీ జలాలపై అవగాహన శూన్యం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. న
నలగొండ ప్రతినిధి డిసెంబర్ 23( నినాదం )
ముఖ్యమంత్రికి నదీ జలాలపై అవగాహన శూన్యం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ల అభినందన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ . ముఖ్యమంత్రికి దమ్ముంటే, వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి, నేరుగా కెమెరా ముందుకు వచ్చి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హోం మంత్రి కూడా ఆయనే కాబట్టి, ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, శిఖండి రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని, కేసీఆర్ గారు సాగునీటి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించడానికి నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, రైతు బంధు వంటి హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు.కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర మంత్రుల అజ్ఞానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి నదీ జలాల అంశం పైన ఎలాంటి అవగాహన లేదన్నారు సాగునీటి శాఖా మంత్రికి నీళ్లపై కనీస అవగాహన లేదని, ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో నీళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు నేను ప్రిపేర్ అయి రాలేదు, రేపు వచ్చి సమాధానం చెప్తానుఅని తప్పించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మరో మంత్రిని ఉద్దేశించి వాటర్ లో నీళ్లు అని మాట్లాడే అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వారు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి హుంకరిస్తున్నారని, అబద్ధాలు చెప్పి గందరగోళం సృష్టించడం తప్ప వీరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేక ఈ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీపీఆర్ పంపడంలో విఫలమవడమే కాకుండా, ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నారని విమర్శించారు.
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదన్నారు . ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. నామినేటెడ్ పద్ధతిపై ధ్వజం ఎత్తారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి ఎన్నికలకు వెళ్లకుండా, నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పెడితే రైతులు తగిన బుద్ధి చెబుతారనే భయం ముఖ్యమంత్రిలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయదారులు, కూలీలు ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారని, ఆ ప్రభావం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.రైతు బంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల భరోసా వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ నిరాధారమైన కేసుల లీకులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు గనక అవకాశం వస్తే కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అని విమర్శించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను కూడా ప్రభుత్వం భయంతోనే వాయిదా వేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహ రెడ్డి మరియు ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

