హీరోయిన్లపై తాను చేసిన పురుషాహంకార, అసభ్య వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు చెప్పాడు. తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై
హీరోయిన్లపై తాను చేసిన పురుషాహంకార, అసభ్య వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు చెప్పాడు. తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై ఆఇవాజీ చేసిన అసభ్య వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు రావడంతో ఓ వీడియో ద్వారా స్పందించిన శివాజీ, తన మాటల్లో రెండు అసభ్యకర పదాలు వాడినందుకు సారీ చెప్పారు. విమర్శలేకాకుండా తెలంగాణ మహిళా కమిషన్ కూడా శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేయడంతో శివాజీ దిగిరావాల్సి వచ్చింది.
ఆయన రిలీజ్ చేసిన వీడియోలో “నిన్నటి ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నేను మాట్లాడిన మాటలకు సిన్సియర్ అపాలజీస్. మంచి విషయాలు చెప్పే క్రమంలో గ్రామీణ భాషలో రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్ దొర్లిపోయాయి. అలా మాట్లాడకూడదు, అది తప్పు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే క్షమించాలి” అంటూ శివాజీ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదని, మహిళలందరినీ ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూస్తున్నారనే ఆవేదనతోనే తాను అలా మాట్లాడానని పేర్కొన్నారు. మహిళలు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే వారికే మంచిదని, స్త్రీ అంటే మహాశక్తి అని గౌరవంగా చూడాలనే ఉద్దేశంతోనే తన వ్యాఖ్యలు అని వివరించారు. అయితే, మాటల ఎంపిక తప్పయిందని అంగీకరించారు.
ఈ వివాదం ప్రారంభమైన తర్వాత చిన్మయి శ్రీపాద, అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, రామ్ గోపాల్ వర్మ వంటి పలువురు సెలబ్రిటీలు శివాజీని ఘాటుగా విమర్శించారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై జోక్యం చేసుకోవడం సరికాదని, అభ్యంతరకర పదాలు వాడటం అనుచితమని వారు అభిప్రాయపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు కూడా ఫిర్యాదులు అందాయి.శివాజీ క్షమాపణలతో ఈ వివాదం చల్లారినట్టే అని కొందరు అంటున్నప్పటికీ, శివాజీ తాను చేసిన కామెంట్ల పట్ల కాకుండా వాడిన రెండు అన్ పార్లమెంటరీ పదాల పై మాత్రమే చింతిస్తున్నట్టు చెప్పడంతో వివాదం ముగిసినట్టు భావించలేము. శివాజీ తాను చేసిన వ్యాఖ్యలపై, తన అభిప్రాయాలపై ఏ మాత్రం వెనక్కి తగ్గినట్టు కనిపించడంలేదు. హీరోయిన్ల పట్ల , మహిళల పట్ల ఆయన చేసిన పురుషాహంకార వ్యాఖ్యలపై ఆయన వెనక్కి తగ్గలేదని, ఆయన ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన క్షమాపణలో ఏ మాత్రం నిజాయితీ లేదని విమర్శలు వస్తున్నాయి.

