చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఆస్ట్రేలియ
చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలోనే భారత్‌లో కూడా 16 ఏళ్ల లోపు వయసున్న వారికి సోషల్ మీడియాను నిషేధించేలా చట్టం తీసుకురావాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఎస్. విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)పై జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో చిన్నారుల జీవితాలు దారి తప్పుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కఠినమైన చట్టం తీసుకురావడాన్ని కేంద్రం పరిశీలించాలని కోర్టు చెప్పింది.
చట్టం అమల్లోకి వచ్చే వరకు వేచి చూడకుండా, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై పిల్లలకు, తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, బాలల హక్కుల కమిషన్‌లను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ఇంటర్నెట్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ధర్మాసనం, ఇది ప్రాథమిక సూచన మాత్రమేనని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా బాటలో భారత్?
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లను వాడకుండా నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలపై భారీ జరిమానాలు కూడా విధిస్తోంది. అదే తరహాలో భారత్‌లో కూడా చర్యలు చేపట్టాలని మద్రాస్ హైకోర్టు సూచించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

