హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతోంది. మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి తెరపై
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతోంది. మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
డిసెంబర్ 19న మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో ఈగల్ టీం, స్థానిక పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు డ్రగ్ విక్రేతలు పట్టుబడ్డారు.వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, మరియు భారీ మొత్తంలో MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన నితిన్, శ్రనిక్ సింఘ్విలను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, వారి రెగ్యులర్ కస్టమర్ల జాబితా బయటపడింది.
వ్యాపారవేత్తలైన నిందితుల నుంచి అమన్ ప్రీత్ సింగ్ తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసేవాడని విచారణలో తేలింది.
కేవలం వినియోగదారుడిగానే కాకుండా, నెట్‌వర్క్‌తో అతనికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, ప్రస్తుతం అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు.డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం, మాసబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా అమన్ కోసం గాలిస్తున్నారు. గత ఏడాది కూడా సైబరాబాద్ పరిధిలో జరిగిన ఒక డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పేరు రావడం, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇప్పుడు రెండోసారి ఈ వ్యవహారంలో ఇరుక్కోవడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌తో పాటు సంబంధం ఉన్న ఇతర ప్రముఖుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. టాలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కావడంతో, ఈ కేసు ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

