హైదరాబాద్ (నినాదం):హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో "అందెశ్రీ జీవితం, సాహిత్యం - సంవీక్షణం" అనే అంశం మీద రెండు రోజుల జ
హైదరాబాద్ (నినాదం):
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో “అందెశ్రీ జీవితం, సాహిత్యం – సంవీక్షణం” అనే అంశం మీద రెండు రోజుల జాతీయ సదస్సును గురువారం ఉదయం ప్రారంభమైంది. మొదటగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అక్షర శిల్పి అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అనే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సభలోని వారందరు సామూహికంగా ఆలాపించారు.తెలుగు శాఖాధ్యక్షులు, సదస్సు సంచాలకులు ఆచార్య పిల్లలమర్రి రాములు ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించి సదస్సు లక్ష్యం తెలియజేశారు. అందెశ్రీ గొప్ప మానవతావాది, జాతీయవాది, సార్వజనీన – సార్వకాలిక కవితా ధర్మం గలవారని అన్నారు. అందెశ్రీలో మారుమ్రోగిన ఆ అందెల రవళి ఎవరిదో, పాము పడగపై పొదిగిన ఆ పాద ముద్రలు ఎవరివో అంటూ అందెశ్రీ పాటల ప్రాశస్త్యాన్ని కవితాత్మకంగా వివరించారు. తెలుగు నేలపై ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలలో గేయాలు చూపిన ప్రభావాన్ని, సామాజిక చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. బండి యాదగిరి, సుద్దాల హన్మంతు గేయ కవుల గొప్పతనాన్ని వివరించారు. “అందెశ్రీ ఆభిజాత్యాలను అధిగమించిన మహాకవి” అని తెలంగాణ రాష్ట్ర గౌరవ శాసన సభ మండలి సభ్యులు డా. గోరటి వెంకన్న పేర్కొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అందెశ్రీ జీవితం, సాహిత్యం – సంవీక్షణం” అనే రెండురోజులు జాతీయ సదస్సుకు ఆయన విచ్చేసి కీలకోపన్యాసం చేశారు. అందెశ్రీ అంతర్ముఖీన కవి అని కొనియాడారు. మానవ జీవన గాథలతో మమేకమైన జీవితం అందెశ్రీది అని అన్నారు. అపర జ్ఞాని అని, బాసర అమ్మవారు, శంకర మహారాజ్ స్వామి, బిరుదురాజు రామరాజు వారి శిష్యరికంలో సంప్రదాయ – సంస్కరణ కవిగా అందెశ్రీ ఎదిగిన క్రమాన్ని వివరించారు. అందెశ్రీ రాసిన “ఒకటే జననం / ఒకటే మరణం”, “జన జాతరలో జయ గీతం/ జన కేతనమై ఎగరాలి”, “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం”, “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” వంటి పాటలకు అందెశ్రీ గొంతుతో మధురంగా పాడి వినిపించారు. కొన్ని అపురూపమైన సంభాషణలను ఏకపాత్రాభినయం చేసి అందరిని అలరించారు. అందెశ్రీ జీవితాన్ని పరిచయం చేస్తూ, వారికి అందెశ్రీ మధ్యగల స్నేహ బంధాన్ని గుర్తుచేసుకొని కొంత భావోద్వేగానికి గురి అయ్యారు. “అక్షరానికి దూరం చేసిన వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అందెశ్రీ జీవితంలో…” అనేకోణంలో సామాజిక విషయాలను తత్త్వ చింతనతో విశ్లేషణ చేస్తూ గద్దర్, నాజర్, వంగపండు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజా తదితరులలో గల భావజాల వ్యాప్తిని తెలియజేశారు.”జీవన తాత్త్విక ఋషి పుంగవులు అందెశ్రీ” అని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అక్షరమే జ్ఞానం అనడం అందెశ్రీ విషయంలో తగదని అన్నారు. అక్షరం లేకున్నా మనిషిలో జ్ఞానం ఉంటుందని, ఎరుక ఉన్నవాడే జ్ఞానవంతుడని అన్నారు. పుట్టిన ఊరితో, మానవ జీవితాలతో, మానవ జాతి వృత్తులతో అపారమైన అనుబంధం అందెశ్రీ ఉండని అన్నారు. తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు ప్రవచించిన బిక్షుకగాయకులే తాత్త్వికులు అని అన్నారు. చదువు లేకున్నా కీర్తి, యశస్సు గల బాలసంతులు, జంగములు, పంబాలవారు, దాసరులు ఎందరో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా దున్న ఇద్దాసును గుర్తు చేశారు. ఇలాంటివారికి ఏ విధమైన రాజకీయ సైద్దాంతిక నేపథ్యం ఉండదని అన్నారు. అందెశ్రీ సాహిత్యానికి పునాది తాత్త్వికత. ఆయన లోకాన్ని మేల్కొలిపే కవిగా వెలుగొందారని అన్నారు. “అభ్యసనం లేకుండా పూర్వ జీవితానుభవాల ద్వారా సాధించినదే విద్య” (Un learn previous life experience) అని ప్రత్యేక పాఠ్యాంశ రూపకల్పనలను గూర్చి వివరించారు. అందెశ్రీ పాటలకున్న ఔన్నత్యాన్ని పాడి వినిపించారు. మనిషి, ప్రకృతి, దేవుడి మీద అందెశ్రీకి ఉన్న కవితాశక్తిని వర్ణించారు. దుఃఖాన్ని యుద్ధంలా మార్చుకుంటేనే విముక్తి కలుగుతుందని, ఆ విధంగా పాటను ఆయుధంగా మార్చుకున్న తెలంగాణ గేయ కవుల ప్రాశస్త్యాన్ని వివరించారు. గౌరవ అతిథులుగా ఆచార్య ఎం. టి. అన్సారి, ఆచార్య వి. కృష్ణ విచ్చేసి అందెశ్రీ గూర్చి, ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రారంభ సమావేశానికి మనోహరమైన, సుమధురమైన వాక్యాలతో డా. పి. విజయకుమార్ స్వాగతం పలికారు. ఆచార్య డి. విజయలక్ష్మి వందన సమర్పణ చేశారు.
మొదటి సమావేశానికి అధ్యక్షత వహించి “ప్రకృతి కవిగా అందెశ్రీ” అనే అంశం మీద ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు ప్రసంగించారు. ఈ సెషన్ లో అందెశ్రీతో బాల్య స్మృతులను గూర్చి అందెశ్రీ బాల్య మిత్రులు నాంపల్లి రాములు, అందెశ్రీతో ప్రపంచ యాత్రా స్మృతులను గూర్చి ఎర్ర సత్యనారాయణ, అందెశ్రీతో సాహిత్య స్మృతులను గూర్చి డా. బోనాల ప్రకాశ్, అందెశ్రీ సాహిత్యంలో ప్రాంతీయ అస్తిత్వం అనే అంశంపై డా. వెల్దండి శ్రీధర్, అందెశ్రీ కవిత్వం – అస్తిత్వ వేదన అనే అంశం మీద ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రసంగించారు.
రెండవ సమావేశానికి అధ్యక్షత వహించి పద్య కవిగా అందెశ్రీ అనే అంశం మీద ఆచార్య ఎం. గోనా నాయక్ ప్రసంగించారు. ఈ సెషన్ లో అందెశ్రీ కవిత్వం – దళిత స్పృహ అనే అంశం మీద ఆచార్య పి. కనకయ్య, ఈ సెషన్ లో అందెశ్రీ కవితా శిల్పం అనే అంశం మీద డా. బి. భుజంగ రెడ్డి, ప్రకృతి చెక్కిన కవన శిల్పం – అందెశ్రీ అనే అంశం మీద సుప్పని సత్యనారాయణ ప్రసంగించారు.వాకులమ్మ గానసభను దేవతా సుధాకర్ అత్యంత రసవత్తరంగా నిర్వహించారు.

