హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో "అందెశ్రీ జీవితం, సాహిత్యం - సంవీక్షణం" అనే అంశం మీద గురు, శుక్రవారాలలో రెండు రోజుల జ
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో “అందెశ్రీ జీవితం, సాహిత్యం – సంవీక్షణం” అనే అంశం మీద గురు, శుక్రవారాలలో రెండు రోజుల జాతీయ సదస్సు విజయవంతంగా కొనసాగింది.
సాయంత్రం సమాపన సమావేశంలో మొదటగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అక్షర శిల్పి అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అనే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సభలోని వారందరు సామూహికంగా ఆలాపించారు.
సమాపన సమావేశానికి తెలుగు శాఖ అధ్యక్షులు, సదస్సు సంచాలకులు ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహించి సదస్సు నివేదికను సమర్పించారు. అందెశ్రీ జీవితంతో కలిసి నడిచిన ఆత్మీయ వ్యక్తులు, సాహిత్యంతో పరిచయం ఉన్న సాహితీకారులు, సమకాలీన జీవన తాత్త్వికత గల వాగ్గేయకారులు, సాహిత్యాన్ని విశ్లేషంచగల కళాశాల అధ్యాపకులను ఆహ్వానించి “అందెశ్రీ జీవితం, సాహిత్యం” విద్యార్థులకు పరిచయాలనే తలంపుతో ఈ రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాతృదేశం మీద ప్రేమను ప్రకటించిన కవులను గుర్తు చేసుకున్నారు. అటువంటి కోవలోకి అందెశ్రీ వస్తారని అన్నారు. తెలంగాణ అంతటా పరుచుకున్న పవిత్రాత్మను అందిపుచ్చుకొని అందెశ్రీ రాసిన పాట రాష్ట్ర గీతమై వెలుగొందుతుందని అన్నారు. “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” అని గేయంలో ప్రతిపాదంలో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, జానపద కళా జావళీలలో గల తెలంగాణ ఆత్మను వర్ణించారు.
“ఆధ్యాత్మిక హేతువాది అందెశ్రీ” అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సి. కాశీం పేర్కొన్నారు. సమాపన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అందెశ్రీ సాహిత్య జీవన తాత్త్వికతలో గల అనేక కోణాలను ఆవిష్కరించారు. అందెశ్రీ తో కలిసి ఉద్యమ యాత్ర కొనసాగించిన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో లక్ష మంది హాజరైన మహాసభలో గద్దర్ అందెశ్రీ తో కలిసి వేదికను పంచుకున్న విషయాలను గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ సాహిత్యం అక్షరంతో సంబంధం లేకుండా నిర్మాణమైందని అన్నారు. సాహిత్యంలో “అల్లడం, రాయడం” వంటి రెండు వారధులు ఉన్నాయని, అందులో గల అంతర్నిగూఢతను విశ్లేషించారు. “కథ మొదలా? కావ్యం మొదలా?” అనే అంశాన్ని సుదీర్ఘ చర్చకు పెట్టారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, ఆకలితో అలమటించి దుర్భిక్ష జీవితాన్ని అనుభవించిన వ్యక్తిగా అందెశ్రీ ఎదిగారు. అటువంటి కవికి చుట్టంగా ప్రకృతియే నిలిచిందని అన్నారు. ప్రకృతిలోని లయాత్మకమై వ్యక్తీకరణ అందెశ్రీ పాటకు తోడైందని అన్నారు. అదేవిధంగా జానపద సాంగత్యం, పండిత ప్రభావం అనేది అందెశ్రీ పాట గుణాన్ని నిర్మాణం చేసిందని అన్నారు. “అక్షరం లేని జ్ఞాన పాండిత్యం” అనేది అందెశ్రీ కవిత్వ ప్రత్యేకత అని అన్నారు. ఇలాంటి జ్ఞానం బండి యాదగిరి, సుద్దాల హన్మంతు, చరబండ రాజు, గద్దర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజలో ఉందని అన్నారు. ఉద్యమమే ఇలాంటి వ్యక్తులను రూపొందించుకుందని అన్నారు. ఒకనాటి కబీర్, వీరబ్రహ్మం, సిద్ధప్ప యోగి వంటివారు తమకున్న జ్ఞానాన్ని పంచుకొని తత్త్వ కవులుగా వెలుగొందారని గుర్తుచేశారు “అందెశ్రీ రాసిన కొమ్మ చెక్కితే బొమ్మరా / కొలిచి మొక్కితే అమ్మరా”, “చూడు తెలంగాణ / చుక్క నీరు లేనిదాన” వంటి గేయాల్లో ప్రాకృతిక ధర్మాన్ని తెలియజేశారు. ఇటువంటి వారి మీద విస్తృత పరిశోధనలు జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఉదయం ప్రారంభమైన నాల్గవ సాంకేతిక సదస్సుకు ఆచార్య డి. విజయలక్ష్మి అధ్యక్షత వహించి “అందెశ్రీ కవిత్వంలో భాషాభివ్యక్తి” అనే అంశం మీద ప్రసంగించారు. ఈ సెషన్ లో డా. బెల్లి యాదయ్య “అందెశ్రీ కవిత్వంలో ఉద్యమ స్ఫూర్తి”, డా. తండు కృష్ణ కౌండిన్య “అందెశ్రీ కవిత్వంలో తాత్త్వికత”, డా. బాశెట్టి లత “తెలంగాణ ముఖచిత్రం అందెశ్రీ పాట” అనే అంశాల మీద మాట్లాడారు.
ఐదవ సాంకేతిక సమావేశానికి ఆచార్య పి. వారిజా రాణి అధ్యక్షత వహించి “సినీ గేయం కవిగా అందెశ్రీ” అనే అంశంపై ప్రసంగించారు. ఈ సెషన్ లో ఆచార్య ఎన్. రజిని “అందెశ్రీ నిప్పుల వాగులోని ఉద్యమ స్ఫూర్తి”, డా. పసునూరి రవీందర్ “అందెశ్రీ పాటలో ప్రయోగ వైచిత్రి” అనే అంశాల మీద మాట్లాడారు.
ఆరవ సాంకేతిక సమావేశానికి ఆచార్య త్రివేణి వంగరి అధ్యక్షత వహించి అందెశ్రీ కవిత్వంలో “ఆధ్యాత్మిక చింతన” అనే అంశం మీద ప్రసంగించారు. ఈ సెషన్ లో డా. నెల్లుట్ల రామాదేవి “అందెశ్రీ రచనల వైవిద్యం”, డా. కోయి కోటేశ్వరరావు “అందెశ్రీ గేయ కవిత్వంలో వస్తు వైవిధ్యం”, ఆచార్య భూక్య తిరుపతి “లోకకవిగా అందెశ్రీ”, డా. ఎస్. రఘు “తెలంగాణ ఆత్మ గీతాకారుడు అందెశ్రీ”, డా. బాణాల శ్రీనివాసరావు “అందెశ్రీ గేయాల్లో సామాజిక స్పృహ”, డా. పి. విజయకుమార్ “మనవీయ విలువల స్ఫూర్తి ప్రదాత అందెశ్రీ”, డా. డి. విజయకుమారి “అందెశ్రీ గేయాల్లో ప్రేమ తత్వం” అనే అంశాల మీద మాట్లాడారు.
సమాపన సమావేశంలో డాక్టర్ బెల్లి యాదయ్య, డాక్టర్ గోనానాయక్, డా. నెల్లుట్ల రమాదేవి ప్రసంగించారు. ఈ సమావేశానికి డా. బాశెట్టి లత స్వాగతం పలుకగా; ఆచార్య భూక్య తిరుపతి వందన సమర్పణ చేశారు.
ఈ సదస్సులో తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు, ఆచార్య గోనానాయక్, ఆచార్య డి. విజయలక్ష్మి, ఆచార్య పి. వారిజారాణి, ఆచార్య త్రివేణి వంగరి, ఆచార్య భూక్య తిరుపతి, డాక్టర్ బి, భుజంగ రెడ్డి, డా. విజయకుమార్, డా. బాశెట్టి లత, డా. డి. విజయకుమారి, ఇతర శాఖల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. డా. పసునూరి రవీందర్ బృందం కలిసి పాడిన అందెశ్రీ పాటలు సభలోని వారందరినీ అలరించాయి. ఈ జాతీయ సదస్సు చివరగా “జనగణమన” జాతీయగీతంతో ముగిసింది.

