HomeGeneralTelangana

తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక.. మేడారం జాతర…

తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక.. మేడారం జాతర…

ప్రపంచానికి మహా జాతరను పరిచయం చేస్తాం ఈ నెల 15లోగా జాతర పనులన్నీ పూర్తి చేస్తం రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జయశంకర్‌ భూపాల

రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ
జర్నలిస్టులకు అండగా నేనున్నా- భరోసా ఇచ్చిన మంత్రి పొగులేటి
‘ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది’
  • ప్రపంచానికి మహా జాతరను పరిచయం చేస్తాం
  • ఈ నెల 15లోగా జాతర పనులన్నీ పూర్తి చేస్తం
  • రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

జయశంకర్‌ భూపాలపల్లి బ్యూరో,(ములుగు) (నినాదం):

వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు…ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాతర ఏర్పాట్ల పై సమీక్షించి తదుపరి మీడియా తో మాట్లాడారు. ఆ తరువాత అమ్మవార్లను దర్శించుకుని సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. మహా జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 251 కోట్లు ఖర్చు చేస్తుందని ఇందులో జాతర నిర్వహణ కోసం 150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు గాను 101 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు. నిధుల ఖర్చు చేయాల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు ఆయన మీడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటికీ జాతర పనులు సగటున 85శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులు 15 వరకు పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశామని పూర్తి చేసిన పనులకు 24గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని అధికారులకు తెలిపారు. గతం లో జాతర నిర్వహణకు 75 కోట్లు, 100 కోట్లు ఖర్చూ చేస్తే తమ ప్రభుత్వం 251 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్, పంచాయతీ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వీరితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు జాతర ను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో అక్కడే కేబినెట్‌ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మేడారం మహాజాతరను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

రోజుకు ఐదు లక్షల మంది వచ్చే అవకాశం…మంత్రి సీతక్క

మేడారం మహా జాతర సందర్బంగా ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని రాష్ట్ర మంత్రి దససరి అనసూయ సీతక్క తెలిపారు. రానున్న రోజుల్లో వాహనాల రాక మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఒక్క రోజునే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. మేడారం జాతర పనులపై తాను అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజల కదలికలపై ప్రత్యేక దృష్టి…మంత్రి శ్రీధర్‌బాబు

జాతర సమయంలో ప్రజల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రౌడ్‌ కంట్రోల్‌కు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు.

గడువులోగా పనులు పూర్తి చేయాలి.. మంత్రి శ్రీనివాసరెడ్డి

మేడారం మహా జాతర సందర్బంగా చేపట్లిన ఆర్‌అండ్‌బీ శాఖ పనులను నిర్దిష్ట గడువులోగా అన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతర క్యూ లైన్లకు సంబంధించిన పనుల పురోగతిని ఈఈ పంచాయతీ రాజ్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రెండు క్యూ లైన్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రాకారం, క్యూ లైన్‌ మధ్య సుమారు 12 అడుగుల లోతు వ్యత్యాసం ఉన్న ప్రాంతాలను మట్టితో నింపి ఈ నెల 15లోపు పూర్తి చేస్తామని తెలిపారు. క్యూ లైన్‌ల కోసం మొత్తం 1,086 రైలింగ్‌ ఫ్యాబ్రికేషన్‌ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
దేవాలయ పరిసరాల్లో ల్యాండ్‌స్కేపింగ్‌ పనులపై జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరణ ఇచ్చారు. ఆలయం వెనుక భాగంలో ఒక భాగం పనులు పూర్తయ్యాయని, మరో ప్రాంతంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పారిశుద్ధ్య పనులపై డీపీఓ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి, కుంభమేళాను ఉదాహరణగా తీసుకుని అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలను మేడారంలోనూ అనుసరించాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు.

మేడారం జాతర పనులపై ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మేడారం జాతర పనుల పురోగతిపై ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేడారంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ టీఎస్ దివాకర తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెల 15వ తేదీలోపు పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన కొన్ని పనులు స్వల్పంగా మిగిలి ఉన్నప్పటికీ, నిత్యం భక్తుల రద్దీ దృష్ట్యా కొంత ఆలస్యం అయినా నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మేడారం మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా మేడారం ప్రాంతాన్ని పూర్తిగా కోర్‌ ఏరియా, పెరిఫెరల్‌ ఏరియాలుగా విభజించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కోర్‌ ఏరియాలో కేవలం దేవాలయ ప్రాంతం మాత్రమే ఉండేలా రూపకల్పన చేశామని చెప్పారు. గత జాతరలో కోర్‌ ఏరియా విస్తీర్ణం సుమారు 32 వేల చదరపు అడుగులు ఉండగా, ఈసారి దాన్ని 54 వేల చదరపు అడుగులకు పెంచినట్లు వివరించారు. గతంలో ఒకేసారి సుమారు 3 వేల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి ఒకేసారి 8 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. మేడారం జాతర లైవ్‌ కవరేజ్‌కు అనుకూలంగా నాలుగు మీడియా వాచ్‌ టవర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గద్దెల ప్రాకారాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందిస్తూ మొత్తం 8 గేట్లను నిర్మించామని, ప్రాకార గోడలపై ఆదివాసీ జీవనశైలి ప్రతిబింబించేలా ప్రత్యేక శిల్పాలను చెక్కినట్లు కలెక్టర్‌ సమీక్ష సమావేశంలో వివరించారు. జాతర ఏర్పాట్లన్నీ సంప్రదాయాలకు భంగం కలగకుండా, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్స్‌ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్‌ టీఎస్ దివాకర, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్ అండ్ బి ఈ ఎన్ సి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.