నేడు బోగి, రేపు సంక్రాంతి, 16న కనుమ మూడు రోజుల పాటు వేడుకలు జయశంకర్ భూపాలపల్లి బ్యూరో ( నినాదం):సూర్యుడు మకర రాశి లో ప్రవేశించేటప్పుడు చేసుకు
- నేడు బోగి, రేపు సంక్రాంతి, 16న కనుమ
- మూడు రోజుల పాటు వేడుకలు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో ( నినాదం):
సూర్యుడు మకర రాశి లో ప్రవేశించేటప్పుడు చేసుకునే పండుగ సంక్రాంతి. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ రోజు సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. కాలానుకూలంగా సాంప్రదాయంగా ప్రాముఖ్యత హార్వెస్ట్ ఫెస్టివల్, శీతాకాలము అయనాంతం వేడుక జరుపుకొనే రోజు. సూర్యుడు మకర రేఖ నుండి దూరంగా ఉన్నప్పుడు రోజు దాని గతి ప్రారంభమవుతుంది రైతులు పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం, తిల తర్పణం సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు మనకు పెద్ద పండుగ సంక్రాంతి. తెలంగాణ ప్రజలు 14న బోగి, 15న సంక్రాంతి, 16న కనుమ జరుపుకోనున్నారు. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగో రోజు ముక్కనుమ ) జరుపుతారు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.
- తెలుగు లోగిళ్ల సంక్రాంతి..!
ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషాధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే – ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు. - భోగి మంటలు..!
భోగి రోజున తెల్లవారక ముందే అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు బంధువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు,పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. - సంక్రాంతి..!
సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి, దాంతో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ మకర సంక్రమణానికి తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. పండుగ రోజుల్లో గంగిరెద్దులను ఆడించే వాళ్లు అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో ధాన్యం దానం చేస్తారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. - కనుమ..!
మూడో రోజు కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. - దానం శ్రేష్ఠం..!
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు. ఏడాదిలో మిగిలిన రోజుల్లో నల్ల నువ్వులు వాడరు. సంక్రాంతినాడు మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము చేస్తారు. - ముగ్గులు..!
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి,చుక్కలు గతిశక్తి సంకేతాలని, ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా చెప్పచ్చు. - గొబ్బెమ్మలు..!
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.

