ముందస్తు మొక్కుల చెల్లింపులు మహా జాతరకు ముందే జనసంద్రం జయశంకర్ భూపాలపల్లి/ మేడారం (నినాదం): మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవ
- ముందస్తు మొక్కుల చెల్లింపులు
- మహా జాతరకు ముందే జనసంద్రం
జయశంకర్ భూపాలపల్లి/ మేడారం (నినాదం):
మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నాడు లక్షలాది మంది సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 28 నుంచి నాలుగు రోజుల పాటు మహా జాతర జరగనుంది. ప్రారంభానికి 12 రోజులే ఉండటంతో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వనదేవతల గద్దెల ప్రాంగణం జన సంద్రమైంది. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించు కున్నారు. అక్కడి నుంచి బెల్లం షాపులకు చేరుకుని తులాభారం వేసుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వన దేవతలకు పసుపు, కుంకుమ, బెల్లం, చీర సారెను సమ ర్పించుకున్నారు. ఎదురుకోళ్ల మొక్కులు చె ల్లించుకున్నారు. తర్వాత కోళ్లు, ఏటపోతులు బలిచ్చారు. శివసత్తుల పూనకాలతో గద్దెల ప్రాంగణమంతా కిటకిటలాడింది. మహా జాతరకు వారం రోజుల ముందే పండుగ వాతావరణం కనిపిస్తున్నది. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జనసంద్రం మేడారం
సంక్రాంతి పండుగ ముగియడంతో మేడారంకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మేడారం అంత భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకుని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించేందుకు బంగారు బుట్టలను తలపై పెట్టుకొని గద్దెలకు చేరుకున్నారు.
తమ కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలకు భక్తులు వడి బియ్యం, బంగారం, చీర, సారె, పసుపు–కుంకుమతో పాటు బంగారాన్ని నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా కంక వనాల (వెదురు అడవులు) మధ్య ఉన్న పచ్చని ప్రకృతిలో వంటావార్పు చేసుకుని, పిల్లలతో కలిసి సంతోషంగ గడిపారు.

