సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి ఇతర భాషా గ్రంథాలను అనేకమంది కవులూ, రచయితలూ తెలుగులోకి అనువదిస్తున్నారు.. ప్రాచీనకాలంలో సంస్కృత, ప్రాకృత గ్రంథాలూ, ఆధుని
సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి ఇతర భాషా గ్రంథాలను అనేకమంది కవులూ, రచయితలూ తెలుగులోకి అనువదిస్తున్నారు.. ప్రాచీనకాలంలో సంస్కృత, ప్రాకృత గ్రంథాలూ, ఆధునికయుగంలో అనేక ఇంగ్లీషు, హిందీతోపాటు ఇతర భారతీయ భాషా గ్రంథాలు తెలుగులోకి అనువదించబడుతున్నాయి. మరి అనువాద సిద్ధాంతాలనుగానీ, పద్ధతులనుగానీ, సూత్రాలనుగానీ తెలుగు అనువాదకులు ఏమైనా తెలిపారా? తెలుగు అనువాదకులు ఎలాంటి అనువాద పద్ధతులను అనుసరించారు? అనే ప్రశ్నలకు జవాబులు వెతకడమే ఈ వ్యాసం లక్ష్యం. తెలుగులోకి అనువదించబడిన అన్ని గ్రంథాలనూ పరిశీలించి యా గ్రంథాల అనువాదకులు తమ అనువాద విధానాలను గురించి ఏమైనా తెలిపారా? అనే విషయాన్ని తేల్చాల్సివుంది. అయితే ఈ చిన్న వ్యాసంలో వందలకొద్ది అనువాద గ్రంథాలను పరిశీలించడం సాధ్యంకాదు. అందు వల్ల ప్రస్తుత వ్యాసాన్ని ప్రాచీన సాహిత్యానికి పరిమితం చేసుకోవడం జరిగింది. ప్రాచీన కవులు అనుసరించిన భాషాంతరీకరణ పద్ధతులను తెలుసుకునే ముందు, అసలు ‘భాషాంతరీకరణ’ అనే భావనను వారు ఏవిధంగా వ్యక్తం చేశారో తెలుసుకుందాం.
ప్రాచీన కవులెవరూ ‘అనువాదం’ అనే మాటను translation అనే అర్థంలో వాడలేదు. అనువాదం అనే మాటకు ఆ రోజుల్లో ‘భాషాంతరీకరణం’, లేదా ‘తర్జుమా’ అనే అర్ధం లేదు. పూర్వకాలంలో ‘గురువు ఉచ్చరించిన మాటలను అనుసరించి శిష్యులు పునః ఉ చ్చరించటం’ అనే అర్ధమున్న అనువాదం అనే మాటను ఆధునికులు translation/భాషాంతరీకరణం/ తర్జుమా అనే అర్థంలో వాడుతున్నారు. మన ప్రాచీన తెలుగు కవులు సంస్కృత పురాణ, ఇతిహాస, కావ్య, నాటకాలను తెలుగులోకి భాషాంతరీకరణం చేయ డాన్ని తెనుగుచేయు, తెనిగించు/ తెలిగించు, తెనుగున రచియించు, తెనుగుగ నొనరించు, తెనుంగుగ నిర్వహించు, తెనుగున ప్రకటించు, తెనుగున చెప్పు అని అన్నారు. ఈ మాటలకు కేవలం ఇతర భాషలనుంచి తెలుగులోకి అనువదించడం అని మాత్రమే ‘అర్థం. తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువదించడాన్ని ఇవి సూచించవు. అందువల్ల నేడు మనం ఈ మాటలను వాడడం మానేశాం. ఏ భాషనుంచి ఏ భాషలోకైనా తర్జుమా చేయడాన్ని తెలుపడానికి ‘అనువాదం’ అనే పదాన్ని ‘భాషాంతరీకరణం’ అనే నూతనార్థంలో వాడుతు న్నాం. మౌలిక భాషాంతరీకరణనూ, లిఖిత భాషాంతరీకరణనూ తెలుగులో ‘అనువాదం’ అనే అంటు న్నాం. ఈ సౌలభ్యంవల్ల ఈ పదం నేడు ఎక్కువ వ్యాప్తిలోకి వచ్చింది. సంస్కృతంలోని పురాణ, ఇతిహాస, కావ్య, నాటకాలను మన ప్రాచీన కవులు తెలుగులోకి తర్జుమా చేసిన సందర్భంలో ఆ విషయాన్ని ఏ పదాలతో చెప్పారో పరిశీలించి తద్వారా వారి అనువాద విధానాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జననుత కృష్ణద్వైపా
యన మునివృషభాభిహిత మహాభారత బ
ద్ధ నిరూపితార్ధమేర్పడఁ
దెనుగున రచియింపు మధికధీయుక్తి మెయిన్
(ఆంధ్ర మహాభారతం. 1-1-16)
అన్నాడు రాజరాజనరేంద్రుడు నన్నయతో, పై పంక్తులవల్ల, వ్యాస భారతంలో నిరూపించబడిన అర్ధం/భావం తెలియునట్లుగా తెలుగులో రచించమని రాజ రాజు నన్నయను కోరినట్లు వెల్లడవు తున్నది. ఇక్కడ ‘రచించు’ అంటే సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులో పునః రచించు అనే అర్ధం చెప్పుకోవచ్చు.
.. నా నేర్చు విధంబున నిక్కావ్యంబు రచియించెదనని… (ఆంధ్ర మహాభారతం. 1-1-20)
….నానారుచిరార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్దితంబుగన్. (ఆంధ్ర మహాభారతం. 1-1-25)
పారాశర్యుని కృతి యయి
భారతమను పేరఁ బరగు పంచమవేదం
బారాధ్యము జనులకుబీ ద
గౌరవ మూహించి నీవఖండిత భక్తిన్
(ఆంధ్రమహాభారతం. 4-1-17)
తెలుగు బాస వినిర్మింపఁ దిపురటరయ
భవ్యపురుషార్థ తరుపక్వ ఫలముగాదె…
(ఆంధ్రమహాభారతం, 4-1-18)
అన్నారు తిక్కన పై పంక్తుల్లో, వ్యాసుడు రచించిన భారతమనే పేరు గల పంచమవేదాన్ని తెలుగులో విశిష్టంగా నిర్మించమని హరిహరనాథుడు తిక్కనను కోరాడు. ఇక్కడ ‘తెనుగుబాస వినిర్మించు’ అనే వాక్యానికి సంస్కృతంలోని భారతాన్ని “తెలుగులో పునర్నిర్మించు” అనే అర్థమే చెప్పుకోవాలి.
…విరాటపర్వమట యుద్యోగాదులుం గూడగా బదియేనింటి దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునన్ దుదిముట్టన్ రచియించుటొప్పు బుధసంతోషంబు నిండారగన్ (ఆంధ్రమహాభారతం, 4-1-7)
అనికూడా అన్నారు తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో
అమ్మనుమ నృపతి కభ్యుద
యమ్ముగ నేఁ జెప్పఁ బూనినట్టి కథకు నా
ద్యమ్మయి యయోధ్యయను నా
నామమ్మున నెగడిన పురోత్తమము వర్ణింతున్.
(నిర్వచనోత్తర రామాయణం. 1-45)
మహాభారతరచనా సమయంలో తాను వ్యాసుడి భారతాన్ని , తెలుగు రచిస్తున్నానని చెప్పిన తిక్కన ఇక్కడ వాల్మీకి రచించిన రామాయణాన్ని గానీ, మరొకరు రచించిన రామాయణాన్నిగానీ (ఉత్తర రామాయణం) తాను తెలుగులో రాస్తున్నానని అనలేదు. మనుమసిద్ధికి అభ్యుదయంగా నేను (చెప్పబూనిన (రచించబూనిన) కథకు మొదట ఆయోధ్య పురాన్ని వర్ణిస్తాను అన్నాడు తిక్కన. ఈ కావ్యం దేనికీ అనువాదం కాదు. నేను నా సొంతంగానే చెబుతున్నాను (రచిస్తున్నాను) అన్నట్లుగా ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని రచించిన విధానాన్ని గురించి పాటిబండ మాధవశర్మగారు ఈ విధంగా అంటున్నారు.
“నిర్వచనోత్తర రామాయణ పీఠికలో “ఆది కవీంద్రులను, నూత్న సత్కవీశ్వరులను” భక్తితో గొల్చినారే కాని వాల్మీకి పేరెత్తి నమస్కరింపలేదు. వాల్మీకి రచించిన ఉత్తరరామాయణమును తాను ఆంధ్రమున కావ్యముగ సంతరింపబూనినట్లు చెప్పలేదు. ఉత్తర కాండ వాల్మీకి కృతము కాదన్న ప్రథ యున్నది. తిక్కనగారి అభిప్రాయము కూడా అదియే కాబోలును, ఉత్తరకాండ నుండి తిక్కనగారు స్వీకరించినది కొంత వస్తువు మాత్రమే. సుమారు సగము వస్తువును పరిహరించిరి. వారు పరిహరించిన యంశములలో పెక్కు ప్రక్షిప్తములని నిర్ణయింపబడినవి. ఇతివృత్తమున చిక్కదనము, ఐక్యము సాధించుట ఆయన తాత్పర్యము. కనుక కావ్యనాయకుడైన
శ్రీరామచంద్రుని యుద్ధ, త్యాగ, ధర్మవీరములు, సంభోగ విప్రలంభశృంగారములు ప్రస్ఫుటములగుటకు అవసరమైన వస్తువును మాత్రమే ఆయన స్వీకరించెను. కౌసల్యాదుల కాలధర్మమును, శ్రీరామాడుల నిర్యాణమును పరిహరించి విజయోత్సవ మంగళముతో ఉ వక్రమించిన కావ్యమును పుత్రసమాగమోత్సవ మంగళముతో ఉ వసంహరించెను.” (మాధవశర్మ, పాటిబండ, 1968 వుట, XIV)
“కొమ్మయ శారిసుమన కకుంఠిత కీర్తి విలాసమొంద గ
ద్యమ్మున దండిచెప్పిన కథాక్రమమొప్పఁ దెనుంగుబాస గ
ద్యమ్మును ఐద్యముంబెరయ సంచితభావ రసోదయాభిరా
మమ్మగునట్లుగా దశకుమార చరిత్రము సెప్పఁ బూనితిన్” …
(దశకుమార చరిత్ర 1-25)
పై పద్యంలో కేతన సంస్కృతంలో దండి రచించిన గద్యకావ్యమైన దశకుమార చరిత్రను తెలుగులో గద్యపద్యాల్లో చంపూకావ్యంగా చెప్తున్నాడు. గద్యాన్ని పద్యంగా అనువదిస్తే అది హృద్యంగా
ఉంటుందన్న రహస్యం తెలిసినవాడు కేతన, గద్యంలో ఉండని ఛందస్సు, లయ, యతి ప్రాసలు పద్యానికి అదనపు రమణీయతను చేకూరుస్తాయి. కాబట్టి గద్యాన్ని పద్యంగా అనువదిస్తే అది తప్పకుండా మనసుకు హత్తుకుంటుంది. పద్యాన్ని గద్యంగా అనువదిస్తే అది నిర్జీవంగా మారుతుంది, మనిషి శరీరమంతటా రక్తం వ్యాపించి వున్నట్లుగా పద్యమంతటా లయ వ్యాపించి వుంటుంది. దాన్ని తీసేస్తే Yvor Winters.
(Quoted by Nowottny, Winifred, 1968: 114), 16 2 గురించి బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రిగారు ఈ విధంగా తెలుపుతున్నారు:
“ఇందలి కథా, ఎక్కువగా భావాలూ మూలానుసారులే. అయినా, ఇతడిందు తన చేయి చూపించకపోలేదు. కథా భాగాలను తాను రసోచితమనుకున్న తావులలో ఇంచుక పెంచుకుంటూ, కుదించుకొంటూనూ, ముందు వెనుకలుగా మార్చుకుంటూ. పోయినాడు. ఉదాహరణకు ఆపహారవర్మ కథలోని వేశ్యకథ తెలుగులో చాలా తగ్గించాడు. విక్రుతుడి కథలోని రాజనీతులు మాత్రం కొంత హెచ్చించాడు… మూలంలోని నవమోచ్ఛ్వాసం దండ్యాచార్యకృతం. కాదని ఉన్న పండిత జన శ్రుతిని బట్టియేమో. ఇతడది వదిలేశాడు.”
(చంద్రమౌళి శాస్త్రి, బెల్లంకొండ 1967: 18,19) తన అనువాదంలో ఇన్ని మార్పులు చేసినా, “దండి చెప్పిన కథా క్రమ మొప్పునట్లుగానే” తెనుగుచేస్తున్నాని అన్నాడు కేతన.
మును సకలశాస్త్ర ధర్మము
విని విజ్ఞానేశ్వరుండు వివిధ ప్రౌఢిన్
దెనుగున జెప్పెద సమస్త దేశీయులకున్
జనులకు దెలిపిన దానిం
(విజ్ఞానేశ్వరీయం, కేతన 1250)
పై పద్యంలో, సంస్కృతంలో విజ్ఞానేశ్వరుడు రచించిన విజ్ఞానేశ్వరీయాన్ని తెలుగులో చెప్తానని అన్నాడు కేతన, కేయూరబాహు చరిత్ర కృతిభర్త అయిన నండూరి గుండన మంత్రి తనతో-
స్థాయిరసము శృంగారం
యలవడఁ గథలు నీతులై యెడనెడరా
గేయూరబాహు చరితము
సేయుము’ నీ వట్టి కావ్యశిల్పము మెరయన్
(కేయూర బాహుచరిత్ర, 1-11)
మంచన రచించిన కేయూరబాహు చరిత్ర రచనా విధానాన్ని గురించి గడి యారం రామకృష్ణ శర్మగారు ఈ విధంగా తెలుపుతున్నారు. – మంచన తన కేయూరబాహు చరిత్రము నందలి ఇతివృత్తమును రాజశేఖర కవి సంస్కృతమున రచించిన “విద్ధసాల భంజిక” యను నాటిక నుండి గ్రహించెను. అయి నను తానందుండి కథను గైకొన్నట్లు ఎందుకో మంచన తెలుపలేదు. మంచన ఈ నాటిక యందలి కథకు సందర్భోచితముగ మార్పులు చేసి నీతి కథలను చేర్చి కేయూరబాహు చరిత్రమును రచించినాడు.
ఇతడు కొన్ని పాత్రల పేరు లను, దేశ-రాజధానుల నామములను మార్చెను, సంస్కృత రూపకమును అనువదించిన తెలుగు కవులలో మంచనయే ప్రథముడు, (రామకృష్ణ శర్మ, గడియారం, 1966: 10,12,24) ఇలాంటి అనువాదాన్ని adoptation అం టారు. తెలుగు మార్కండేయ పురాణ కృతిపతి నాగయగన్న విభుడు తనతో-“పరమ విజ్ఞానాశ్రయంబైన మార్కండేయాఖ్యమహా పురాణము విన గౌతూహలంబయ్యెడిన్” “కావునఁ దత్పురాణము ప్రకాశితసార కథామృతంభోగిం ద్రావి జగజ్జనంబు లలర స్వచియింపు తెనుంగున స్వచః శ్రీవిభవంబు పెంపు విలసిల్లగఁ గోవిదు లిచ్చమెచ్చి సం భావన సేయఁ జారుగుణభాస్వర మారయ సత్కవీశ్వరా!”
(మార్కండేయపురాణము, 1-17)
అని అన్నట్లు మారన తెలిపాడు. మార్కండేయపురాణ తెలుగు అనువాద విధా నాన్ని గురించి జి.వి. సుబ్రహ్మణ్యంగారు ఈ విధంగా “మారన మహాకవి మార్కండేయ పురాణాన్ని తెలిపారు భావానుపద్ధతిననుసరించి తెలుగుచేశాడు. మారనకు నన్నయ, తిక్కనలు పూర్వులు, గురుతుల్యులు వారిది కథానువాద పద్ధతి. వారి ప్రభావం మారన మీద బలంగా కనపడుతుంది. కాని, వారి అనువాద పద్ధతిని మారన స్వీకరించలేదు. దానికి కారణం వారిది ఇతిహాస రచన, మారనది పురాణ రచన. అయినా వారి అనువాద కళలోని పెక్కు మెళకువలను మాత్రం మారన గ్రహించాడు…..
మారన అనువాద పద్ధతిలో గమనింపదగిన మరికొన్ని విశేషాలు:
- ఉపాఖ్యానాలను అనువదించే సందర్భంలో కథార్థాలకు ఉ ప్రబలకంగా లేని సన్నివేశాలను, వివరణలను వదిలివేశాడు.
- కథాగమన వేగానికి అడ్డువచ్చే వివిధ శాస్త్ర విషయాలను వదిలాడు. దేవతా స్తుతులను కొన్నింటిని వదిలాడు. కొన్నింటిని సంగ్రహంగా కుదించాడు, కొన్నింటిని మూలాన్ని ఛాయామాత్రంగా ఉంచుకొని స్వీయ కల్పనలతో పెంచి స్వాతంత్ర్యాన్ని ప్రదర్శించాడు.
- మారన సహజంగా రసలుబ్ధుడు. శాస్త్రాది విషయాలను తెలుగుచేసేటప్పుడు వాటిని సంగ్రహించినా, రసభావపోషణకు పస్కారకాలకాలైన అంశాలను స్వీయ ప్రతిభా పాటవంతో విస్తరించి రచించిన ఘట్టాలెన్నో ఉన్నాయి….
- మారన ఔచిత్యమెరిగి అమూలకాలైన అంశాలను పెక్కింటిని కల్పించి పురాణానికి కావ్యకళా గౌరవాన్ని కలిగించాడు. (సుబ్రహ్మణ్యం,జి.వి. 1984)
సంస్కృతంలోని మార్కండేయపురాణాన్ని తెలుగులో చెప్తున్నానని అంటూనే మారన “రచిస్తున్నాన”నే మాట వాడాడు ఈ కింది పద్యంలో- అంటే ఇక్కడ తెలుగులో పునః రచిస్తున్నాని అన్నట్లు అర్ధం చేసుకోవాలి.
ఇమ్మార్కండేయ పురా
ణమ్మఖిలహితమ్ము గాగ నానేర్చు గతిన్
నెమ్మి విరచించెదం బ
ద్యమ్ముల గద్యముల భవడుదాత్తానుమతిన్
(మార్కండేయపురాణము. 1-23)
ఎర్రన రచించిన ‘హరివంశము’ కృతిభర్త ప్రోలయవేమారెడ్డి ఎర్రనలో-
భారత పరాంశమని యిం
పారగఁ జెప్పుదురు బుధులు హరివంశము
నీ వా రమ్యకథ తెనుంగుగ
ధీరోత్తమ! నిర్వహించి తెలుపుము మాకున్
(హరివంశం -పూర్వభాగం 1-11)
అని అన్నట్లు తెలిపాడు. తెనుంగుగ నిర్వహించు’ అనే వాక్యానికి సంస్కృతంలోని హరివంశాన్ని తెలుగులో పునః రచించు అనే అర్ధాన్ని చెప్పుకోవాలి. హరివంశ అనువాద విధానాన్ని గురించి వురిపండా అప్పలస్వామిగారు ఈ విధంగా తెలిపారు. హరివంశం అనువాదంలో అతడు మూలంలోంచి కొంత కొంత విడిచిపెట్టాడు. లేనిది కొంత చేర్చాడు. చిన్న చిన్న మార్పులున్నూ చేసి కావ్యానికి తెలుగుతనం తీర్చిదిద్దాడు… కొన్ని సంక్షేపించాడు. కొన్ని పెంచిన ఘట్టాలున్నూ ఉన్నాయి… నిజం చెప్పాలంటే ఇది అనువాదం కాదు అనుసరణ. ‘తెనుంగుగ నిర్వహించడం’ అంటే ఇదే కవి అభిప్రాయం. (అప్పలస్వామి, పురిపండా, 1969:42) నృసింహపురాణంలో ఎర్రన.”… బ్రహ్మాందాది పురాణోక్తంబయిన శ్రీనరసింహావతారంబను పురాణంబుఁ దెనుంగుభాష ప్రకటింప వలయును. (నృసింహపురాణము. 1-27) అని అన్నారు. ‘తెనుంగు భాషం బ్రకటించవలయును’ అంటే తెలుగులో పునర్మించాలనే అర్థం.
భట్టహర్షుండు ప్రౌఢ వాక్పాటవమున
నెద్ది రచియించే బుధలోక హితము పాంటె
నట్టి నైషధ సత్కావ్య మాంధ్రభాష
ననఘ యొనరింపు నా పేర సంకితముగ.
(శృంగారనైషధం 1-16)
“సంతరించితి నిండు జవ్వనంబునయందు పార్షనైషధకావ్య
మాంధ్రభాష (కాశీఖండం 1-07)
“వీరభద్రేశ్వరుఁ బ్రబంధ విభునిఁ జేసి
కాశికాఖండము దెనుగుగా నొనర్తు (కాశీఖండం 1-16)
పై పద్యపాదాల్లో శ్రీనాథుడు, ఆంధ్రభాషన్ యొనరించు, ఆంధ్రభాషన్ సంతరించితి, తెనుగుగా నొనర్తు అనే వాటిని తెలుగులోకి అనువదించు అనే అర్ధంలోనే వాడాడు. అయితే తాను సంస్కృత పురాణాలను, కావ్యాలను అనువాదం చేశానని చెప్పడమే కాకుండా తాను అనువదించిన పద్దతిని కూడా చెప్పిన మొదటి కవి శ్రీనాథుడే. ఇంతకు పూర్వపు కావ్యాల్లో ఎక్కడా లేని విధంగా శృంగార నైషధకావ్యం చివర కావ్యోపసంహారం అనే విభాగంలో తన అనువాద పద్ధతిని వివరించాడు శ్రీనాథుడు.
కావ్యోపసంహారం … భట్టహర్ష మహాకవీశ్వరుండు (గవి కులాదృష్టాధ్వ పాంథుడొనర్చిన నైషధశృంగార కావ్యప్రబంధ విశేషణం బున, నశేష మనీష హృదయంగమంబుగా, శబ్దంబనుసరించియు, నభిప్రాయంబు గుర్తిం చియు, భావంబు పలక్షించియు, రసంబు పోషించియు, నలంకారంబు భూషిం చియు, నౌచిత్యాంబాదరించియు, ననౌచిత్యంబు పరిహరించియు, మాతృకానుసారంబునఁ జెప్పబడిన యీ భాషానైషధ కావ్యంబు…
(శృంగారనైషధం, 8-202)
పై వచనంలో తాను మూల గ్రంథంలోని శబ్దాన్ని అనుసరించి, మూలభాషా గ్రంథకర్త అభిప్రాయాన్ని గుర్తించి, భావాన్ని లక్ష్యంగా చేసుకొని, రసాన్ని పోషించి, అలంకారాలతో అలంకరించి, ఔవిత్యాన్ని పాటించి, అనౌచిత్యాన్ని తొలగించి అనువాదం చేశానన్నాడు. ఇన్ని మార్పులుచేసినా తాను మాతృకానుసారంగానే తెలుగు చేశానన్నాడు. ఇది గమనించాల్సిన విషయం. అంటే మూల గ్రంథంలోని ప్రధాన కథను మార్చకుండా మిగతా మార్పులుచేసి అనువదించాడని అర్థం. ఇలాంటి అనువాదన్నే అనువాద సిద్ధాంతకర్తలు ‘అనుసృజన’ (Transcreation) అంటారు. నన్నయ దగ్గరనుంచి శ్రీనాథునిదాకా అందరు కవులూ ఇదే పద్దతిని అనుసరించినట్లు పైన చెప్పిన వివరాల వల్ల తెలుస్తుంది. కాకపోతే, నన్నయాది కవులు చెప్పని అనువాద విధానాన్ని శ్రీనాథుడు స్పష్టంగా చెప్పాడు. “స్కందపురాణ నీరధికి ఖండము లేబది వానిలోన నా నందవనానుభావ కథనంబున వక్తకు శ్రోతకున్ శుభా నంద పరంపరావహము వైజగుణంబునఁ గాశిఖండ మా కందువ నేనెఱింగి సమకట్టితిఁ గాప్యముగా నొనర్పగన్” (కాశిఖండం 1-8)
శ్రీనాథుని అనువాద విధానాన్ని గురించి మల్లంపల్లి శరభేశ్వర శర్మగారు ఈ విధంగా తెలుపుతున్నారు – కాశీఖండ పీఠికలో శ్రీనాథుడు. - “కాశీకాఖండమను మహాగ్రంథమేను దెనుగు చేసెదను” అని
2 “ఆ కందువ నేనెఱింగి సమకట్టితి గావ్యముగా నొనర్పగన్” అనియును తన రచనా స్వరూపమును రెండు విధములుగా నిర్దేశించియున్నాడు. “మొదటిది- కాశికాఖండము సంస్కృత భాషలో మహాగ్రంథము, దానిని నేను తెనుగు చేసెదను’ అన్నాడు. ఇచ్చట ఒకటి గమనింపవలయును. ‘తెనుగు చేయుట’ అనగా అనువాదము చేయుట కాదు. నన్నయాదులైన పూర్వాంధ్రకవులు కూడా భారతాదులను అనువాదము చేయలేదు. తెనుగు చేసినారు. ఈ శతాబ్దిలోని కొందఱు భారతాది గ్రంథములకు అనువాదములు చేసిరి. నన్నయాదులవలె తెనుగు చేయలేదు. రెండింటికి భేదము-మూల గ్రంథ గత పరమార్ధమును లెప్పగా భావించి దానిని తమదిగా చేసికొని, ఆ పరమార్ధమును తెనుగు భాష స్వరూప స్వభావ మర్యాదలకు పొంది పొసగియుండునట్లు తమ కవితారీతిలో స్వతంత్ర కావ్యమనిపించినట్లు తిరిగి నిర్మించుట-తెనుగుచేయుట. మూల శ్లోకార్ధమును యథాతథముగా- తెనుగు పద్యములో వ్రాసికొనిపోవుట అనువాదము చేయుట. తెనుగు చేసెడు కవి స్వతంత్రుడు అనువాదకుడు పరతంత్రుడు.
రెండవది: ‘సమకట్టితిఁ కావ్యముగా నొనర్పగన్’ తాను పురాణమును పురాణముగ రచించుటలేదు. కావ్యముగ నొనర్చుటకు సమకట్టినాడు. కావున దానిని కావ్యముగానే చూడవలసియుందును. ఇట్టి తెలుగు చేసిన కావ్యములను అవి రచింపబడిన ప్రయోజనమును దృష్టియందుంచుకొని చూడవలెను. ఇవి స్వతంత్ర కావ్యములన్న దృష్టితోఁ జూచినప్పుడే వాని నిజస్వరూపము వెల్లడియగును. అనువాద ఉద్దేశాన్నిబట్టి, ప్రయోజనాన్ని బట్టి అనువాద విధానం ఉ ంటుందని పై మాటలు తెలుపుతున్నాయి. ప్రబోధ చంద్రోదయం సంస్కృతంలో కృష్ణమిశ్రునిచేత రచించ బడిన ఆరంకాల నాటకం, తెలుగులో దీనిని నందిమల్లయ, ఘంట సింగయలు ఐదంకాల ప్రబంధం (కావ్యంగా)గా అనువదించారు. 1470 ప్రాంతంలో దీనిని రచించి పూసపాటి బసవభూపాలుని మంత్రి అనంతామాత్యుని గంగమంత్రికి అంకితమిచ్చారు. ఇతను నందిమల్లయ, ఘంట సింగనలను ఉద్దేశించి-
అనవుడు ననంతవిభు గం/గన వారలఁజూచి యిట్టి ఘన నాటకముం
దెనుగునఁ బ్రబంధశయ్యకు/ నొనగూర్చగ నేర్చు సుకవులుర్విం గలరే?
(ప్రబోధ చంద్రోదయము. 1-22)
భారతుల మార్కండేయశర్మ ఈ అనువాదాన్ని గురించి ఈ విధంగా అంటున్నారు. దృశ్యకావ్యమును శ్రవ్యకావ్యముగా చేయుట చేత అనువాదమున ప్రారంభముననే గాక కథాప్రణాళికలో కొన్ని మార్పులు ప్రవేశ పెట్టవలసి వచ్చినది. “అనువాదమనగా నౌక పుస్తకమును వేషము మార్చి వరొక వేషమువేసి చూపుటే కదా! ఇక లోపలనుండు నంగ ప్రత్యంగ రూపురేఖలు యథాస్థితములే కదా? అందును వాక్యమునకు వాక్యమును శబ్దమునకు శబ్దమును వ్రాసియుంచినచో శాబ్దికాను వాదమందురు. అప్పుడు వాగ్ధారలందు మచ్చునకైన నుండవు. అనువాదకుడు గనుక నధిక స్వాతంత్ర్యము
(దీసికొన్నచో నది ఛాయానువాద మనబడును. కథా విచారములున్న వున్నట్లు వచ్చినచో భావానువాదమగును. భాషాంతరీకరణమున వట్టి మూల కథా సారాంశమే వచ్చినచో మర్మానువాడ మందురు. శాబ్దికానునాదములో మౌలి కత యుండుటకే వీలులేదు.”
(భారతుల మార్కండేయశర్మ. 1969 : 11)
అమర హుళక్కి భాస్కర మహాకవి చెప్పగనున్న యుద్ధకాం డము తరువాయి చెప్పేఁ బ్రకట ప్రతిభాషణు డప్పలార్య స త్తమ సుతు డయ్యలార్యుడు కృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా…
(భాస్కర రామాయణం. యుద్ధకాండ. 1618)
అయ్యలార్య విరచితంబయిన శ్రీరామాయణ కావ్యంబునందు యుద్ధకాండ శేషంబు సర్వంబు నేకశ్వాసము. (భా.రా. యుద్ధకాండ ఆశ్వాసాంత గద్య)
“తన వచోవిశేష మెనయక పూర్వక
థామితోక్తిఁ జెప్పుటేమి కడిది
యొకడు కోలవట్టి యొయ్యనఁ గొనిపోవ
సంధుదెచటికైన నరుగు టరుదె”
(సింహాసన ద్వాత్రింశిక 1-34)
శబ్దానువాదం చెయ్యడం అనేది అందుడు ఒకరు ఇచ్చిన కర్రను ఊతగా చేసుకొని నడవడం లాగా సులువైనది. తన సొంత కవితా విశేషాలు లేకుండా అనువాదం చెయ్యడం పెద్దవిశేషం కాదు అన్నది కొరవి గోపరాజు అభిప్రాయం.
Ezrapound translations were affen accused of be-ing inaccurate. But Pound was unrepentent, for he felt that any fool with a bilingual dictionary could be accu-rate (Asha s Kanwar 1995)
I am persuaded that the translator must recast the original into his own likeness- better a live sparrow than a stuffed eagle (, : 180) Letaal transbrion is a lazymang translation అంటాడు ఒక అనువాదవేత్త
“ఈ సరసోక్తి కావ్యమొక దిమ్ముల సంస్కృత భాషనచ్చుఁ జేసిన పట్ల వీరు మణి చేయుట యేటిడి యంచుఁ తిప్పగాఁ జేసి యనాధరం బురక చేయకుడి విలుకాడు తూటుగా వేసిన నందె పాల మణి యేసిన వానిధ సూటిగావునన్”
(సింహాసన ద్వాత్రింశిక 1-35)
మూలభాషా గ్రంథ రచయితకన్న అనువాదకుడు చేసే పనే కష్టమైనదని కొరవి గోపరాజు అభిప్రాయం. ఒక విలుకాడు ఏడో ఒకచోట బాణం వేయడం కష్టం కాదు. విలుకాడు వేసిన స్థానంలోనే మరో విలుకాడు బాణం వేయడం కష్టం అని గోపరాజు పోలిక చెప్పాడు. కానీ, ఈ పోలికలోనే ఏదో లోపం ఉన్నట్లు కొంత సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది. మొదటి విలుకాడు ఏదో ఒకచోట బాణం వేయడం కాకుండా ఒక నిర్ణీత లక్ష్యంపై బాణం వేయడం కష్టం. మొదటి విలుకాన్ని అనుసరించి రెండో విలుకాడు అదే లక్ష్యంపై బాణం వేయడం సులభం. ఒకరు చేసిన పనిని అనుసరించడం ఎప్పుడూ సులువే, అనువాదంలో కథ, పాత్రలు, సంఘటనలు అన్నీ మూల భాషా రచయిత సృష్టించినవే. అనువాదకుడు ఇవేవీ మళ్ళీ సృష్టించనవసరంలేదు. కాబట్టి అనువాదకుడిపై ఈ భారం పడదు.
“చిత్రఖ్యాతి వితీర్ణ విక్రమనిధి శ్రీవిక్రమాదిత్య దా
రిత్రఖ్యాపన శాసనంబులకు భూరి స్తంభ సంభారమై
ధాత్రీపాలురుఁ గావ్యవేడులును మోదంబంద సింహాసన
ద్వాత్రింశత్యకథల స్థుణంబులుగఁ గావ్యం బొప్పుగాఁ జెప్పెదన్”
(సింహాసన ద్వాత్రింశిక 1-59)
గద్య పద్యాత్మకమైన ఒక సంస్కృత విక్రమార్క చరిత్రమును వావిళ్ళవారు 1936లో ప్రకటించిరి. అదియే గోవరాజు అనువదించిన మూల గ్రంథము, ఆ సంస్కృత మూలమును పూర్తిగా గ్రహించి గోపరాజు మణికొన్ని కథలను సమకాలిక జవజీవన విశేషములను చేర్చి “సింహాసన ద్వాత్రింశిక” అను పేర ఈ కథాకావ్యమును రచించెను. (రామకృష్ణశర్మ, గడియారం, 1982 పరిష్కర్త. 1982 సింహాసన ద్వాత్రింశిక)
“మును రామాయణము న్నిరోష్ఠ్యముగ నింపుల్మేర శాకల్లె మ ల్లన తా సంస్కృత భాషఁ జేసెనన నాలాగున్ జెవుల్ నిండగా వినుటేగాని ధరిత్రిలో విజముగా వీక్షింపలేదట్టిదే దెనుగుం జేసేద నెల్లెడన్ గవులకున్ దృష్టాంతమై ఏర్పడన్”
(దశరథరాజ నందన చరిత్ర 1-32)
సింగరాచార్యుల అనువాద విధానాన్ని గురించి శ్రీరంగాచార్య ఈ విధంగా అంటున్నారు. “సంస్కృత రామాయణమును తెనుగున పరివర్తన గావించినవారిలో నొకరిద్దరు తప్ప వందరును విపులముగనో, కొంత సంక్లిష్టముగానో, మరి కొన్ని కొన్ని యువాఖ్యాలను చేర్చియో రచన సాగించినవాడే, సింగరాచార్యులు నిరోకు నియమము వలనవేమో ఈ రచనను మిక్కిలి సంక్లిష్టము చేసివారు. మూలములోగల రసవంతమైన కొన్ని కథలను వదలి పెట్టినాడు. ఎంత సంక్షిప్తమనగా సుమారు 68 వర్గలుగల సుందరకాండను 10 పద్యములలో చెప్పినాడు.” (శ్రీరంగాచార్య, 1979. 65) దశరథరాజు నందన చరిత్ర,
“విను కాళహస్తి మహిమం.
బనుపమమై నెలయ, మును షడధ్యాయికథన్
దెనుగునఁ కావ్యముగ నోన
ర్చెను బెద ధూర్జటి కవీంద్ర శేఖరుడనగా!”
(స్కాందాంతర్గతమైన వైష్ణవఖండమందలిది)
బహుపురాణ మధిత భవ్యార్థ శివతత్త్వ సారమెల్ల నైక్యపరణి బొదలి జగతి శివరహస్య సంగ్రహమను నితి హాస మొనరు విబుధు లభినుతింప
ఆ యితిహాసమందలి యుత్తర భాగంబునందు భాస్వన్నిరూఢి గాళహస్తి మహత్త్వకథ మాట యిర్వేది యధ్యాయముల చెలువమరుచుండు
తత్కథఁ దెనుగున ద్రాక్షారసోర్మి కా పరిపాక విస్ఫూర్తి పరిధవిల్ల గృతి యొనర్పుము మదంకితముగ శబ్ద చమత్కృతి పండితులది గణింప (ధూర్జటి లింగరాజకవి)
కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పమని కర్పూర తాంబూలం బు వెట్టినం బట్టి మహా ప్రసాదంబని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకు ప్రారంభించితి. (మనుచరిత్ర)
కోన విర్ధలరాజు తన కుమారుడైన కోన బుద్ధరాజుతో “భూమిఁ గవీండ్రులు బుధులును మెచ్చ రామాయణంబు పురాణమార్గంబు తప్పక నా పేర దగ సంధ్రభాష జెప్పి ప్రఖ్యాతంబు సేయిం పు ముర్వి యని యానతిచ్చిన..(రంగనాథ రామాయణము బాలకాండ. 93,94,95)1949.”అది కవీశ్వరుడైన వాల్మీకి యాదరంబునఁ బుణ్యులందఱు మెచ్చ జెప్పిన తెఱగున శ్రీరామచరిత మొప్పఁ జెప్పెద గథాభ్యదయమెట్టిదనిన”
(రంగనాథ రామాయణము -బాలకాండ 102,103)
కవి యిందు శ్రీమద్రామాయణమున లేని జంబుమాలి వృత్తాంతము, కాలనేమి కథ, సులోచనా చరిత్రము చదువ పాఠకులకు, శ్రోతలకుఁ బరవశత్వము కలిగించుననుటలో వింతలేదు. (వెంకట సుబ్రహ్మణ్యశర్మ, జనమంచి, పీఠిక, రంగనాథరామాయణం)
“సరస (నష్ట) పువ్వులుగ మాలకరి పెక్కు తెలఱగుల విరుల నెత్తులుగఁ గావించినట్లు/కర్పూర కస్తూరికావస్తు వితతిచే శ్రీఖండ చర్చ వాసించినట్టు లొడికంబుగా గంధవొడికి నానాసూన పరిమళంబులు గూడ/ ఐఱచినట్లు సరఘలు వివిధ పుష్ప మరంద లవములు గొనివచ్చి తేనియ గూర్చినట్లు
“భారతప్రోక్త కథ మూలకారణముగ/ కాళిదాసుని నాటక క్రమము కొంత
తావకోక్తికి నభినవశ్రీ వహింస/ గూర్మిఁ గృతి సేయు నాకు శాకుంతలంబు” (శృంగార శాకుంతలము 1-27) కృష్ణకుమారి, నాయని.
పాండురంగ మాహాత్మ్యం కృతిభర్త విరూరి వేదాద్రి తెనాలి రామకృష్ణకవిని “తగ సంస్కృతము దెనుంగుగఁ జేయఁ దెనుగు సంస్కృతముగఁ జేయంగఁ జతురమతివి” (పాండురంగ మహాత్మ్యము 1-23) ప్రశంసించాడు. అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి, గౌరు పెద్ది రామసుబ్బశర్మ, పరిష్కర్తలు, 1967,
“వీరరాజ విరచిత భారత వచనము వ్యాసభారతమునకు సరయైన భాషాంతరీకరణము ఒక్క విశేషాంశమైనను వెలివోనీక యీతడు సమగ్రముగా వ్యాసుని యర్ధముం గొని తెచ్చినాడు. గద్య వ్రాయుటకు ఆశ్వాసములను విభాగములు వేసినట్లుగా తోచుచున్నదే కాని ఆదిపర్వము మొదలు వ్యాస భారతాధ్యాయములు అధ్యాయములుగానే కానవచ్చుచున్నవి. భాషాంతరీకరణమే యని
రచన చప్పిడి కాలేదు. ఆంధ్రము యొక్క జాతీయ పక్కి కొరబడలేదు గంభీర్య మ వసరమగు చోట రేచన గంభీరముగా నడచి వర్ణనాదికి ఘట్టముల యందు
తత్తద్విషయమును కండ్లకు గట్టినట్లు గోచరింపజేసినది. సంభాషణ సంబంధమగు ఘట్టములయందా తిక్కన చిన్న వాక్యములు ప్రత్యక్షమయి హృదయమును తస్కరించుచున్నవి. జిగి, బిగి, లాలిత్యము, మాధుర్యము అన్నియు నీ వచన రచన యందు కానంగ నగును.” (వెంకటేశం పంతులు, ఎన్.కే. 1928 ఆంధ్ర వచన శ్రీమహాభారతం.
డాక్టర్ బాణాల భుజంగరెడ్డి
అసోసియేట్ ప్రొఫెసర్
తెలుగుశాఖ , హైదరాబాద్ విశ్వవిద్యాలయం
హైదరాబాద్ – 500046
సెల్: 72178 72141
