తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి మొదలైంది. గత కొంతకాలంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలకు సమాయత్తమవుతున్
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి మొదలైంది. గత కొంతకాలంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలకు సమాయత్తమవుతున్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో సుదీర్ఘంగా భేటీ అయిన ఆయన, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీ వేదికగా పోరాటం
ఈ నెల 29న కేసీఆర్ శాసనసభకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా నీటి పారుదల రంగంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా వినిపించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి, ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నీటి హక్కులే ప్రధాన ఎజెండా
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో నెలకొన్న స్తబ్దతపై కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్యాయమే చేస్తోందని, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని మండిపడ్డారు.రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా లేదని, ఉమ్మడిగా తెలంగాణను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని, నీటి హక్కుల పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని నేతలకు సూచించారు.
నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం:
“మనం మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్లాలి. జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాలి. ప్రభుత్వాలను ఎండగట్టడంలో వెనకాడొద్దు” అని కేసీఆర్ నేతల్లో ఉత్సాహం నింపారు. రాబోయే రోజుల్లో నీటి పారుదల ప్రాజెక్టుల చుట్టూనే తెలంగాణ రాజకీయం తిరగనుందని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.

