‘‘సహితస్య భావ: సాహిత్యమ్, హితేన సహితమ్ సాహిత్యం’’ అనేది ఆర్యోక్తి. సాహిత్యం హితాన్ని చేకూరుస్తుంది. మనుషులు మంచి మార్గంలో నడవడానికి తోడ్పాటు నిస్తుంద
‘‘సహితస్య భావ: సాహిత్యమ్, హితేన సహితమ్ సాహిత్యం’’ అనేది ఆర్యోక్తి. సాహిత్యం హితాన్ని చేకూరుస్తుంది. మనుషులు మంచి మార్గంలో నడవడానికి తోడ్పాటు నిస్తుంది. తెలుగు సాహిత్యంలో నీతి ప్రబోధకమైన శతకాలు కూడా అంతే మనుషుల యొక్క అలవాట్లను మారుస్తాయి. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో ఎంతోమంది నీతి శతకాలు రచించారు. ఆ శతకాలలోని కొన్ని పద్యాలు ప్రజల నాలుకలపై నాట్యమాడుతున్నాయి. వీటిలో కొన్ని నీతి, భక్తి శతకాలుగా కూడా ఉన్నాయి. గ్రామాలలో వాటిని పాడుకుంటూ భజనలు చేస్తుంటా. ఇలా అనేక రకాల నీతులలో నిండినదే దార్ల మాట (తేటగీతి)నీతి శతకం. ఈ శతకానికంటే ముందు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ‘దారిపూలతోట దార్ల మాట’ మకుటంతో ఒక ఆటవెలది శతకాన్ని 2021లో ప్రచురించారు. ఇప్పుడు తేటగీతిలో ‘దారి చూపించునట్టిది దార్ల మాట’ మకుటంతో ఈ శతకం సరళమైన పదాలతో, భావాల సహితంగా ప్రచురించడం విశేషం. దీని ద్వారా నిజాయితీ, సత్యం, ధర్మం, ప్రకృతిపై ప్రేమ మంచి సంస్కారం వంటివెన్నో నేర్చుకోవచ్చు. మనిషికి కోపం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో తెలుసుకోవచ్చు. ఈ శతకంలోని అన్ని పద్యాలు మనవుడికి కాలసిన నీతిని అత్యంగా అద్భుతంగా బోధిస్తాయి. గతంలో వచ్చిన సుమతీ, వేమన తదితర నీతి శతకాలు, కావ్యాల్లో కనిపించే నీతులను కూడా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఈ కాలానికి ఉపయోగపడేలా తనదైన శైలిలో చెప్తినట్లు అనిపిస్తుంటాయి. ఈ వ్యాసంలో దార్లమాట (తేటగీతి) నీతి శతకంలో గల అంశాలను వివిధ విభాగాలుగా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను.
శతకంలోని కొన్ని పద్యాలను పరిశీలించి చూస్తే…
సత్యవాక్యమునే పలుక వలేను…
కల్ల లాడక నెప్పుడు కరుణ తోడ
సత్య ధర్మము తప్పక సాగవలయు
నవ్వుచుండెడివాడితో నయముతోడ
దారి చూపించు నట్టిది దార్లమాట
జీవితానికి ఏది సరైన దారి చూపిస్తుందో పై పద్యం లో సత్యమును వీడకుండా నిజాయితీగా ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మనం నివసించే చోట ఆనందంగా ఉండగలమని తెలుసుకోవచ్చును.
సోమరితరమును వీడుము….
కష్ట పడకుండ ఫలితము గలుగ బోదు
సోమరితనము విడచిన సుఖము కలుగు
దీక్ష తోడను పని జేయ ధనము వచ్చు
దారి చూపించు నట్టిది దార్లమాట
దీక్షతో ఏదైనా పని మొదలు పెడితే అది నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ధనమును సంపాదించి పెడుతుంది. ధనము కావాలంటే ముందు నీలో ఉన్న సోమరితరమును విడిచి పెట్టాలి. అప్పుడే నీ అభివృద్ధికి బంగారు బాటలు పడతాయని తెలుస్తుంది. జీవితం మీద ఒక మంచి ఆలోచన, ఆసక్తి పెరుగుతాయి. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి అన్న ఆలోచన ప్రతి మనసులో వస్తుంది. కష్టపడకుండా ఎటువంటి ఫలితం ఉండదు అని తెలుసుకోవచ్చు.
నీడ నిచ్చిన చెట్టును నరక తగదు…
మేలు చేసిన వానిని మరువ తగదు
వినయగుణమును కలిగియు వెలయ వలయు
దారి చూపించునట్టిది దార్లమాట.
ఎండలో అలసి వచ్చిన మనకు నీడనిచ్చి కాపాడిన చెట్టును, మనకు సహాయం, మేలు చేసిన మనుషులను మరువకూడదు. వాళ్ళ పై ఎల్లప్పుడు నమ్మకంగా ఉండాలి. కృతజ్ఞత మనిషికి అసలైన ఆభరణం అని తెలుసుకోవాలి.
తల్లిదండ్రులను గౌరవంతో పూజించు…
కన్న తల్లిని తండ్రిని గారవించి
సేవ జేసిన పుణ్యము సిద్ధమగును
దివ్వమెరుగక గుడికేగ దీక్షవలదు
దారి చూపించునట్టిది దార్లమాట.
ఆధునిక సమాజంలో మనుషులు దేవతల చుట్టు తిరుగుతూ భక్తిని వెతుకుచున్నారు. దేవుడు ఆశీర్వాదం కోసం ఎదురుచూపులు చూస్తున్న వారు ఎక్కువగా కనబడుతున్నారు. అది మంచిదే. కానీ, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి వారికి కంటికి రెప్పలా కాపాడుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయి. తల్లిదండ్రులే కదా ప్రత్యక్ష దైవాలనేవి గుర్తించాలి. తల్లిదండ్రుల సేవయే పరమాత్మ సేవ. దేవాలయమునకు వెళ్లే పని లేదు అని అద్భుతంగా పై పద్యం ద్వారా వర్ణించారు. విఘ్నేశ్వరుడు విఘ్నాధిపత్యం కోసం తన సోదరుడు కుమారస్వామితో పోటీపడినప్పుడు తల్లిదండ్రుల చుట్టూనే తాను ప్రదక్షిణం చేసి, లోకానికి అందరికీ తన తల్లిదండ్రులే జగద్రక్షలుగా విఘ్నేశ్వరుడు భావిస్తాడు. తల్లిదండ్రులను పూజిస్తే సకలకార్యాలు నెరవేరడమే కాకుండా, దైవాన్ని కూడా పూజించినట్లే అనే పౌరాణిక గాథ ఈ పద్యం చదివినప్పుడు స్ఫురిస్తుంది.
సమయం ఒక్క విలువ తెలియజేస్తూ…
చేయి జారిన నీరును చేర్చ వశమె
గడచి పోయిన కాలము కలుగు నొక్కొ
సమయ ముండగ పనులను సలుప వలయు
దారి చూపించునట్టిది దార్లమాట.
కాలం ఎంత విలువైనదని మనిషి జీవితంలో ప్రతి సెకను ఎంతో విలువైనదే కదా. భూమి మీద ప్రతి ప్రాణి రోజులు గడుస్తున్న కొద్ది చావుకు దగ్గర అయినట్లే కదా. అందుకే సమయం విలువ తెలుసుకొని జీవించడం చాలా ముఖ్యం. చేజారిన నీరు ఎలా మళ్లీ చేతులోకి తీసుకోలేమో అలాగే గడిచిన సమయం కూడా అంతే తిరిగితే లేము.
అత్యాశ మనిషికి చేటు…
అతిగ నాశను పడినను నవని యందు
ఉన్న దంతయు పోవును వరుస తోడ
తృప్తి కలిగియు నుండుట గొప్ప గుణము
దారి చూపించునట్టిది దార్లమాట.
అతి ఆశ గతిచేటు అన్నట్లుగా మనిషి ఉన్నదాంట్లో తృప్తి చెందాలి కాని అత్యాశకు పోకూడదు. ఒకవేళ అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. అప్పుడు మనిషికి ఉన్న సంతోషం, సంతృప్తి రెండు దూరమవుతాయి అని తెలుసుకోవచ్చు.
ప్రకృతి మాతను ప్రేమించు…
వృక్షమున్నచో వానలు వృద్ధి నొందు
పంట పండును లోకాన పదిలముగను
నరుడు ప్రకృతి మాతను నమ్మవలయు
దారి చూపించునట్టిది దార్లమాట.
ప్రస్తుత నూతన ఆధునీకరణల పేరుతో పట్టణాలలో అనేక ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వాహన రద్దీతో ఎటు చూసినా కాలుష్యం తిండి, నీరు, గాలి అన్ని వనరలు కాలుష్యం కోరల్లో చిక్కుకొని ఉన్నది. పై పద్యం ప్రకృతిని ప్రేమించి దానిని కాపాడుకుంటే మనిషికి ఎంతటి మేలుని సమకూరుస్తుందో తెలియజేస్తుంది. నువ్వు నన్ను కాపాడితే నేను నిన్ను కాపాడుతా అన్నట్టు మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని తెలుసుకొని ప్రకృతిని కాపాడే దిశగా ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేశారు.
దుష్టుడికి దూరంగా ఉండాలి….
మంచి వాడును చెడ్డతో మసిలినంత
కీడు కలుగును గద మరి క్రియల యందు
దూర ముండవలె నెపుడు దుష్ట బుద్ది
దారి చూపించునట్టిది దార్లమాట.
సమాజంలో పెద్దల మాట ఒకటి ఉంది. దుష్టుడికి పది అడుగుల దూరంలో ఉండాలి అని దుర్జన సాంగత్యం మంచిది కాదని మంచి మనుషులతో కలిసి జీవించడం మంచిదని దార్ల మాట ఒక మంచి మార్గాన్ని చూపుతుంది.
అనుభవమే మొదటి గురువు…
నిప్పు ముట్టిన గాలదా నిఖిల మందు
దెబ్బ తగిలిన బుద్ధియు దెలియు నట్లు
అనుభవమ్మున పాఠము నబ్బ వలయు
దారి చూపించునట్టిది దార్లమాట.
అనుభవంతో వచ్చే మార్పు మానవుడికి జీవిత కాలం గుర్తుండిపోతుంది అంతేకానీ ఇతరులు చెప్పిన ఎక్కడో చదివిన వచ్చే జ్ఞానం అంతకంటే తక్కువే కదా. ప్రతి మానవుడు అనుభవ పూర్వక బుద్ధితో తన పనులు సక్రమంగా చేసుకుంటే అన్నిట్లో విజయం తప్పకుండా సాధించవచ్చని అనుభవమే మొదటి గురువుగా చెప్పడం అద్భుత విషయం.
పరోపకారమే పరమార్ధం – ఉత్తమ మార్గం…
దీప మన్నది తానును దహన మగుచు
వెలుగు నిచ్చును గద మరి విశ్వ మందు
నలుగురైనను మెచ్చగ నడుప వలయు
దారి చూపించు నట్టిది దార్లమాట.
ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదు. దీపం వలె ప్రతి మానవుడు బ్రతకాలి. దీపం తనను తాను దహించుకుంటూ ఇతరులకు వెలుగును పెంచుతుంది. నలుగురికి మంచి చేసి మంచివాడిలా బ్రతకాలి అప్పుడే జీవితం సార్థకం అవుతుంది కదా!
మాట తీపి కంటే మనసులో నిజాయితీ ముఖ్యం…
పైకి తీపిని పల్కెడి పరుల మాట
నమ్మ రాదు గదా యిల నవని యందు
మనసు లోపలి కపటము మాన వలయు
దారి చూపించు నట్టిది దార్లమాట.
కొందరు మన ముందు మంచి మాటలు చెప్తుంటారు. మనసులో కపట బుధ్దితో ఉంటారు. అటువంటి స్నేహం, బంధుత్వం చాలా ప్రమాదమని తెలుసుకోవాలి.
ఏకాగ్రతతో విజయం సాధ్యం…
కొంగ చేపకై కనిపెట్టి కూర్చు నట్లు
విద్య నేర్వగ శ్రద్ధను వెలయ వలయు
పట్టు దలయున్న విజయంబు పథము జేరు
దారి చూపించునట్టిది దార్లమాట.
నీటిలో కొంగ చేపల కోసం ఎంత ఓర్పు ఏకాగ్రతతో చేపలను కనిపెడుతుందో విద్యార్థులు కూడా అంతే ఓర్పు ఏకాగ్రతతో ఉంటే విజయం నీ బానిసగా అవుతుంది. జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది. అంతేకాదు మనిషి భూమి వలె ఓర్పు కలిగి ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడు భయపడి వెనుదిరుగ కూడదు ఓర్పు, సహనం, పట్టుదల ఉన్న వాడికి ఓటమి బానిస అవుతుంది. అప్పుడు విజయం సిద్ధిస్తుంది.
మంచి మిత్రుడు ఎవరు?…
ఆప దందున ఆదుకొను నట్టి వాడె
మంచి మిత్రుడు జగతిని మరువ వలదు
అద్ద మట్లుగ నిజమును నాడ వలయు
దారి చూపించు నట్టిది దార్లమాట.
ధనము, సంతోషము మన యందు ఉన్నప్పుడు వచ్చే మిత్రుడి కన్నా కుచేలుడు ఆపదలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏ విధంగా ఆదుకుంటాడో అలా మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తారో వాళ్లే మంచి మిత్రులు…
తల్లి ప్రేమకు మించిన ధనం లేదు…
తల్లి ప్రేమను మించిన ధనము లేదు
త్యాగ మందున మాతకు సాటి లేదు
మమత జూపెడి తల్లిని మరువ వలదు
దారి చూపించు నట్టిది దార్లమాట.
నవ మాసాలు మోసి ఎన్నో కష్టాలను సంతోషంగా స్వీకరించేది తల్లి మాత్రమే. లోకంలో ప్రతి జీవి తను ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తన ప్రాణానికి ఎంత అపాయం ఉన్న అన్నిటిని భరిస్తుంది. చివరికి ఒక జీవికి భూమి పైకి తెస్తుంది. ఆలనా పాలనా చూస్తుంది. అంతటి ప్రేమను చూపించేది ఒక మాతృమూర్తి మాత్రమే. అటువంటి తల్లిని దైవంగా భావించి గౌరవంతో పూజించాలి. అని దార్ల మాట మంచి విషయాన్ని ఇక్కడ తెలియజేసింది.
గురువు ప్రత్యక్ష దైవం…
గురువు నేర్పిన విద్యయే గురుతు నిలుచు
జ్ఞాన దీపము వెలిగించు నవని యందు
గురుని దీవన నున్నచో గెలుపు నిశ్చయము
దారి చూపించు నట్టిది దార్లమాట.
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”
“మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. “గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. గురువు దృష్టి, ఆశీర్వాదం శిష్యుడు పై ఉంటే అప్పుడు తన శిష్యుడు ఎంతటి కష్టమైన పనిలోనైనా సరే అది ఏ రంగంలో అయినా సరే విజయం సాధిస్తాడు. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావించాలి అని నీతిని పై పద్యం తెలియజేస్తుంది.
మనుషులంతా ఒక్కటే…
కులము మతమను భేదము గూడ దనగ
మనుషులందరూ ఒక్కటె మరువ వలదు
ప్రేమ పంచెడి మనసులే పృథివినున్న
దారి చూపించు నట్టిది దార్లమాట.
జగతి మీద చాలా చోట్ల మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఏ మతమైనా ఏ కులమైన మనమంతా మనుషులం అన్న మాట మరువకూడదు. అన్ని కులాల పట్ల సోధర భావం కలిగి మెలగడమే ఉత్తమ మార్గం మానవత్వమే అన్నిటికంటే మిన్నా అని తెలుసుకోవడం శ్రేయస్కారమని గుర్తుచేస్తుంది.
సత్యమే మనిషికి శక్తి…
ధర్మ మెప్పుడు రక్షించు ధరణి నిలచి
న్యాయ మార్గము వీడక నడవ వలయు
సత్య నిరతియే మనిషికి శక్తి యగును
దారి చూపించు నట్టిది దార్లమాట.
ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా అధర్మం అసత్యమును మనిషికి వినాశనానికి దారితీస్తుంది. అందుకే ధర్మ మార్గంలో నడవాలి సత్యమును వీడకూడదు అవే మనిషికి అసలైన ధైర్యాన్ని ఇస్తాయి. సత్యం ధర్మం మనిషికి అందమైన అలంకరణగా ఉంటాయి.
ముగింపు..
దార్ల మాట నీతి శతకం చదివిన వారికి అనేక విషయాలలో చక్కని నీతి అలవడుతుంది. ఈ నీతి శతకం చదవడం వల్ల తల్లిదండ్రులను ఎలా పూజించాలి. గురువుల ఎలా గౌరవించాలనే విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవం పొందాలంటే ఏం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? సమయం యొక్క విలువ, ప్రకృతిపై ప్రేమ, స్నేహం యొక్క విలువ, చదువు యొక్క ప్రాముఖ్యత, సమయపాలన మంచి సంస్కారం, పరులు ఎవరైనా కష్ట సమయంలో ఉంటే వారిని ఎలా ఆదుకోవాలని తెలుసుకోవచ్చు. దుర్బుద్ధి, మూర్ఖ భావంతో ఉన్నవారికి ఎలా దూరంగా ఉండాలో తెలుసుకోవచ్చు, మేలు చేసిన వారికి విశ్వాసంగా ఉండటం వంటి అనేకమైన నీతి విషయాలు మనకు దార్ల మాట (తేటగీతి)నీతి శతకం బోధిస్తుంది. ఈ శతకం ఒకటి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టినట్లయితే వారు జీవితంలో మంచి మార్గంలో నడవడానికి ఎంతగానో ఉపయోగపడతుంది. ఈ శతకం సరళమై పదాలతో నిండి ఉన్నది. ఈ కాలంలో కావాల్సిన, రావాల్సిన శతకంగా ఈ శతకాన్ని అభివర్ణించవచ్చు.
- డి. సాయినాథ్ రెడ్డి
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్

