హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం హైదరాబాద్, (నినాదం):ప్రపంచీకరణ సాంకేతిక విప్లవ యుగ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాతృ
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
హైదరాబాద్, (నినాదం):
ప్రపంచీకరణ సాంకేతిక విప్లవ యుగ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు పేర్కొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. మాతృభాష కోసం ప్రాణాలర్పించిన విద్యార్థులకు నివాళులర్పిస్తూ సుమారు ఏడున్నర దశాబ్దాల క్రితం ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు మాతృభాష సంరక్షణ కోసం ఉద్యమం నిర్వహించి ప్రాణాలర్పించారని ఆనాటి చారిత్రక అంశాలను వివరించారు.. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రాసి ఆలాపించిన తెలుగు భాష జయ గీతం సభలోని వారందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఆచార్య పమ్మి పవన్ కుమార్ మాట్లాడుతూ…
ప్రపంచంలో క్రమంగా అనేక భాషలు అంతరించిపోతున్న సమయంలో వాటిని కాపాడుకోవడం కోసం జరుపుతున్న ప్రయత్నాలను గూర్చి వివరించారు. ఈ ఏడాది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవానికి యునెస్కో ప్రతిపాదించిన నినాదం ‘బహుభాషా విద్యా వ్యవహారాల్లో యువత ప్రతిధ్వని’ (Youth voice of multilingual education) అని అన్నారు. త్రిభాషా సూత్రాన్ని అనుసరించి ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషల ద్వారా విద్యాభ్యసనం అనివార్యం కావడం వల్ల మాతృభాషల మనుగడ కొనసాగుతుందని అన్నారు. కాని యునెస్కో గణాంకాల ప్రకారం దేశీయభాషలు అంతరిస్తున్నాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీనికి మూల కారణం మధ్య యుగాలలో ఏర్పడిన అస్థిర రాజరిక పాలనా వ్యవస్థ అని వివరించారు. భాషలను చరిత్ర, సమాజం, సంస్కృతి, ఆర్థికం, పాలన వంటివి ప్రభావితం చేస్తాయని అన్నారు. అమెరికాలోని భాషా ప్రముఖులు మల్టీ లింగ్వల్ గా ఆంగ్ల భాషను ఉపయోగించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. బహుభాషల వ్యవహారంగా అమెరికా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసిందని అన్నారు. భావోద్వేగభాషగా తెలుగును మనం తరువాతి తరాలకు అందిస్తూనే శాస్త్రీయంగా భాషను సంరక్షించుకోవాలని సూచించారు. ఆయా జాతులకే పరిమితమైన ప్రత్యేక అస్తిత్వం, ఉనికి గల భాషను ఎలా కాపాడుకోవాలో వివరించారు. రాజ్యాంగ భాషా నిర్దేశాల ప్రకారం లిపి వ్యవహారం లేని మాతృభాషలు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. అందులో ముఖ్యంగా బోయ, కొండ, గోండు, కోయ, సవర భాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. కాలానుగుణంగా సాంకేతిక వనరుల తోడ్పాటుతో భాషలను పునరుజ్జీవింపజేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో మన మాతృభాష తెలుగుకు మంచి స్థానం ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో విక్కీపిడియా వంటి అనేక ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. దేశీయ భాషోత్సవాల సందర్భంగా మౌఖికంగా, లేఖనంగా భాషను పునరుద్ధరించుకోవాలని, అవసరమైతే కొత్త భాషలను సృష్టించుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు.
ఆచార్య డి. విజయలక్ష్మి మాట్లాడుతూ…
భాషలప్రాధాన్యతను కోల్పోకుండా తమ తమ భాషల ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటితరం పై ఉందన్నారు. తూర్పు పాకిస్థాన్ – బంగ్లాదేశ్ లో భాష సమాన హోదా కోసం జరిగిన ఉద్యమం ప్రపంచాన్ని కుదిపేసిందని అన్నారు. ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆత్మ గౌరవ భాషా పోరాటం, ప్రాణత్యాగం పర్యవసనాల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని మాతృభాషలు సంరక్షింపబడాలని యునెస్కో ప్రతి సంవత్సరం మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. ఈ క్రమాన్ని ఒకసారి అనుశీలిస్తే భాష అనేది చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక, నైసర్గిక నేపథ్యంతో కూడుకొని ఉందన్నారు. అందుకు అనుగుణమైన కొన్ని ఉదాహరణలు ప్రస్తావిస్తూ ఆయా వృత్తులు, సంచార వృత్తుల్లో శబ్ద సంపద, పద విస్తృతి అనంతంగా ఉందని అన్నారు. సూక్ష్మ దృష్టి ద్వారా, దేశీయ జీవన వ్యవహారాల ద్వారా భాషను పరిరక్షించుకోవచ్చని తెలియజేశారు.
డా. బాణాల భుజంగరెడ్డి మాట్లాడుతూ…
మాతృభాషల అభివృద్ధిలో మన కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని కొనియాడారు. మాతృభాషల అభివృద్ధికి అభిప్రాయాల సేకరణతో పాటు అభివ్యక్తి ప్రధానమని అన్నారు. 2008 యునెస్కో గణాంకాల రికార్డుల ప్రకారం ఏడు వేల భాషలు అంతరించే స్థితిలో ఉన్నాయని అన్నారు. కానీ ఆయా భాషల మనుగడ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు చెప్పుకోదగ్గవని ప్రస్తావించారు. ప్రాంతీయ భాషా వ్యవహారాల్లో గల సామాజిక సాంస్కృతిక పురోభివృద్ధి కోసం నూతన విద్యా విధానం (NEP), జాతీయ కేంద్ర గ్రంథాలయాలు (NCL), భారతీయ భాషాభివృద్ధి సంస్థ (CIIL), జాతీయ అనువాద సంస్థ (NTS), జాతీయ తాళపత్ర సంస్థ (NMS), కేంద్ర సాహిత్య అకాడమీ, ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం, దక్షిణ ప్రాదేశిక భాషల అభివృద్ధి సంస్థ వంటివి ఎంతగానో కృషి చేస్తున్నాయని అన్నారు. పాఠ్యపుస్తకాల నిర్మాణం, అనువాద గ్రంథాల రచనలు, పురస్కారాల ప్రదానం చేసి ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు సంబంధించి వర్క్ షాప్స్ నిర్వహిస్తూ పద వ్యుత్పత్తి కోసం ప్రయత్నం చేస్తుందని అన్నారు. మాతృభాషల విస్తృతిలో సామాజిక మాధ్యమాల సేవ అంతా ఇంతా కాదని కొనియాడారు.
ఆచార్య భూక్య తిరుపతి మాట్లాడుతూ…
బంజారా భాషలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అబ్బురపరిచారు. ఏ ఇతర భాషలోనైనా ప్రసంగం గాని, పాఠ్యభాగం గాని విన్నా మొదటగా మాతృభాషలోనే అర్థస్ఫురణకు కలుగుతుందని అన్నారు. ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల్లో గిరిజన భాషలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనదేశంలో 40 శాతం గిరిజన భాషలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అస్మిత ప్రాజెక్ట్ భాషా సంరక్షణ కోసం పాటుపడుతుందని అన్నారు. చివరగా మాతృభాష ఒక అక్షయపాత్రగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ డి. విజయ కుమారి పలకగా, వందన సమర్పణ డాక్టర్ పి. విజయకుమార్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పి. వారిజా రాణి, ఆచార్య వంగరి త్రివేణి, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

